సర్కారు దవాఖానాల్లో కుదేలైన ‘కు.ని’ సేవలు.. ప్రైవేట్‌ దోపిడీకి పేదల బలి!

family planning

family planning

family planning:  ఉచిత వైద్యం అందించాల్సిన సర్కారు దవాఖానాలు చేతులెత్తేస్తున్నాయి! నిరుపేద కుటుంబాలకు కొండంత అండగా నిలవాల్సిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో మూలనపడ్డాయి. ఆస్పత్రుల్లో వైద్యం అందక, ప్రైవేటు ఆస్పత్రుల్లో వేలాది ఫీజులు భరించలేక సామాన్యులు అల్లాడిపోతున్నారు. ప్రభుత్వ పెద్దలు, వైద్య శాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితులు ప్రైవేట్ దవాఖానాలకు కాసులు కురిపించే అవకాశంగా మారాయి.

ముఖ్యంగా కోఠిలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి నిత్యం వేలాది మంది రోగులు వస్తుంటారు. అయితే కు.ని. ఆపరేషన్ల కోసం వెళ్లే బాధితులకు నెల రోజుల వరకు ఖాళీ లేదంటూ అక్కడి సిబ్బంది తిప్పి పంపుతున్నారు. అంతకాలం ఆగలేక, ప్రైవేటు సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. వనస్థలిపురం ఏరియా ఆస్పత్రి పరిస్థితి కూడా దీనికి భిన్నంగా ఏమీ లేదు. అక్కడ కు.ని. ఆపరేషన్లు చేయడం లేదని వైద్యులు తేల్చిచెబుతూ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారు.

మరోవైపు ప్రైవేట్ ఆస్పత్రులు ఈ పరిస్థితిని అనుకూలంగా మార్చుకుని బాధితుల నుంచి విచ్చలవిడిగా డబ్బులు లాగుతున్నాయి. మహిళలకు చేసే ట్యూబెక్టమి ఆపరేషన్ కోసం రూ.35 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఆ తర్వాత మందులు, ఫీజుల పేరిట వేల రూపాయలు అధనంగా పిండుకుంటున్నారు. రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద కుటుంబాలకు ఈ స్థాయి ఖర్చులు మోయలేని భారంగా పరిణమించాయి. అప్పులు చేసి మరీ ప్రైవేటులో ఆపరేషన్లు చేయించుకోవాల్సిన దుస్థితి నెలకొంది.

సర్కారు దవాఖానాల్లో ఉచితంగా జరగాల్సిన సేవలు నిలిచిపోవడం వెనుక ఉన్న కారణాలపై ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. అన్ని ప్రధాన ప్రాంతాల్లో ప్రత్యేక కుటుంబ నియంత్రణ శిబిరాలు ఏర్పాటు చేసి, నిరుపేదలకు ఉచిత ఆపరేషన్లు వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు.