Apple Pay: భారతీయ యాపిల్ యూజర్ల చిరకాల స్వప్నం నెరవేరింది. అమెరికాలో లాంచ్ అయిన దశాబ్దానికి పైగా నిరీక్షణ తర్వాత, ఎట్టకేలకు టెక్ దిగ్గజం యాపిల్ తన కాంటాక్ట్‌లెస్ పేమెంట్ సేవ అయిన ‘యాపిల్ పే’ (Apple Pay)ను అధికారికంగా మన దేశంలోకి తీసుకొచ్చింది. ఎలాంటి క్యూఆర్ కోడ్స్ స్కాన్ చేసే పని లేకుండా, కేవలం ఫోన్ లేదా వాచ్‌ను స్వైపింగ్ మెషిన్‌కు చూపించి క్షణాల్లో బిల్లులు చెల్లించే సరికొత్త డిజిటల్ అనుభూతిని ఇది యూజర్లకు అందిస్తోంది.
ఏయే ఫోన్లలో, డివైజ్‌లలో పనిచేస్తుంది?
ప్రస్తుతం ఈ సేవలు లేటెస్ట్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను సపోర్ట్ చేసే డివైజ్‌లకు పరిమితం చేశారు. ఐఓఎస్ 18 (iOS 18) లేదా ఆపై వెర్షన్ రన్ అవుతున్న ఐఫోన్ ఎక్స్ఆర్ (iPhone XR) మరియు ఆ తర్వాతి మోడళ్లన్నింటిలోనూ ఇది పనిచేస్తుంది. అలాగే, వాచ్‌ఓఎస్ 11 (watchOS 11) లేదా తర్వాతి వెర్షన్ కలిగిన యాపిల్ వాచ్ సిరీస్ 6 మరియు ఆపై మోడల్ వాచ్‌లలోనూ ఈ కాంటాక్ట్‌లెస్ చెల్లింపులు చేసుకోవచ్చు. ప్రారంభ దశలో ఈ సేవలు కేవలం యాక్సిస్ బ్యాంక్ జారీ చేసిన వీసా, మాస్టర్‌కార్డ్ క్రెడిట్ కార్డులకు మాత్రమే అందుబాటులో ఉండగా.. రాబోయే రోజుల్లో మరిన్ని బ్యాంకులు, ఇతర కార్డ్ నెట్‌వర్క్‌లు ఈ జాబితాలో చేరనున్నాయి.
యాపిల్ పే సెటప్ చేయడం ఎలా?
ఈ సేవలను వినియోగించడం చాలా సులభం, పూర్తిగా సురక్షితం. మీ ఐఫోన్‌లో ముందుగా డిఫాల్ట్‌గా ఉండే ‘వాలెట్’ (Wallet) యాప్‌ను ఓపెన్ చేయాలి. అక్కడ కుడివైపు పైన కనిపించే ప్లస్ (+) గుర్తుపై ట్యాప్ చేసి, మీ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు వివరాలను నమోదు చేయాలి. ఒకసారి కార్డు వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత మీ యాపిల్ పే యాక్టివేట్ అవుతుంది. స్టోర్లలో చెల్లింపులు చేసేటప్పుడు ఐఫోన్ సైడ్ బటన్‌ను (పాత మోడళ్లలో హోమ్ బటన్) డెబిల్ క్లిక్ చేసి, ఫేస్ ఐడీ లేదా టచ్ ఐడీతో అథెంటికేట్ చేసి ఫోన్‌ను పేమెంట్ రీడర్‌కు దగ్గరగా ఉంచితే లావాదేవీ ఇట్టే పూర్తైపోతుంది.
ఎక్కడెక్కడ వాడవచ్చు? యూపీఐ సంగతేంటి?
ప్రస్తుతానికి ఈ సేవలను భారత్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన ‘యూపీఐ’ (UPI) తో అనుసంధానించలేదు. కేవలం క్రెడిట్ కార్డుల ద్వారా మాత్రమే లావాదేవీలు జరుగుతాయి. అయితే, తొలుత దేశవ్యాప్తంగా ఉన్న యాపిల్ స్టోర్లు, క్రోమా, రిలయన్స్ రిటైల్ స్టోర్లు, బ్లింకిట్, జొమాటో, చాయోస్, టాటా 1ఎంజీ వంటి ప్రముఖ ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ వేదికలపై యాపిల్ పే సేవలను వినియోగించుకోవచ్చు. క్రెడిట్ కార్డులపై లభించే రివార్డు పాయింట్లు యథావిధిగా వర్తిస్తాయి కాబట్టి, యాపిల్ యూజర్లకు ఇది నిజంగా ఓ అదిరిపోయే గుడ్ న్యూస్ అనే చెప్పాలి..
