ప్రజా ప్రతినిధుల ప్రగతి ప్రసంగాలు.. ఎల్బీనగర్ నడిరోడ్లపై మురుగు కన్నీళ్లు

Drainage Crisis

Drainage Crisis

Drainage Crisis: కోట్లు వెచ్చించి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని వేదికలెక్కి ఉపన్యాసాలు దంచే నాయకులకు, క్షేత్రస్థాయిలో ప్రజలు పడుతున్న నరకయాతన కానరాకపోవడం దారుణం. ఎల్బీనగర్ నియోజకవర్గవ్యాప్తంగా డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమై, నిత్యం మురుగునీరు రోడ్లపై పొంగిపొర్లుతుండటం ప్రజాప్రతినిధులు, అధికారుల అలసత్వానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది.

ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న మన్సూరాబాద్ కేబీఆర్ కన్వెన్షన్ పరిసర ప్రాంతాలు మొదలుకుని నియోజకవర్గంలోని పలు ప్రధాన రోడ్లు, అంతర్గత కాలనీల వరకు దాదాపు అన్ని చోట్లా ఇదే దుస్థితి నెలకొంది. డ్రైనేజీలు ఉప్పొంగి నిత్యం మురుగునీరు రోడ్లపై పారుతుండటంతో వాహనదారులు, బాటసారులు ఆ అసహ్యకరమైన నీటిలోనే ప్రయాణించాల్సి వస్తోంది. నిత్యం దుర్గంధం తాళలేక చుట్టుపక్కల నివాసితులు ఇళ్ల తలుపులు కూడా తీయలేని పరిస్థితి నెలకొంది. రోజూ పాఠశాలలకు వెళ్లే చిన్న పిల్లలు, పాదచారులు ఈ కంపు నీటిలోనే నడుస్తూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మురుగు నిల్వలతో దోమలు ముసురుకుని డెంగ్యూ, మలేరియా వంటి అంటురోగాలు వేగంగా వ్యాపిస్తున్నాయని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎన్నికలు వస్తున్నాయి, పోతున్నాయి.. నాయకులు మారుతున్నారు తప్ప తమ కాలనీల తలరాతలు మారడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “అసలు మీరు చెప్పే అభివృద్ధి ఇదేనా? నిత్యం రోడ్లపై ప్రవహిస్తున్న ఈ కంపు మురుగు నీటిలో స్థానిక రాజకీయ నాయకులు, అధికారులు ఒక్క రోజైనా నడవగలరా? ఈ దుర్గంధాన్ని ఒక్క క్షణమైనా భరించగలరా?” అని బాధితులు నిలదీస్తున్నారు. ఓట్ల కోసం వచ్చే నాయకులు గెలిచాక సమస్యల వంక కన్నెత్తి చూడకపోవడం పరిపాటిగా మారింది. ఇప్పటికైనా జీహెచ్‌ఎంసీ అధికారులు, ప్రజాప్రతినిధులు నిద్రమత్తు వదిలి తక్షణమే స్పందించాలి. నియోజకవర్గవ్యాప్తంగా ఉన్న డ్రైనేజీ లైన్లకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో అధికారుల కార్యాలయాల ముందే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తున్నారు.