ఖైరతాబాద్ రాజకీయం హీట్.. కోర్టు తీర్పుపైనే అందరి చూపు, ఎందుకో తెలుసా?

Vijaya Reddy

Vijaya Reddy

Vijaya Reddy: తెలంగాణ రాజకీయాలో ఖైరతాబాద్ ఉప ఎన్నిక జరుగుతుందా లేదా అనే అంశంపై తీవ్ర సస్పెన్స్ కొనసాగుతోంది. 2023 సాధారణ ఎన్నికల్లో దానం నాగేందర్ గెలుపును సవాలు చేస్తూ కాంగ్రెస్ నాయకురాలు విజయారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఎన్నికల పిటిషన్ కారణంగా ఉప ఎన్నికకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లు కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో విజయారెడ్డి గురువారం మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

దానం నాగేందర్ ఎన్నికపై తాను కోర్టులో పిటిషన్ వేశానని, న్యాయస్థానంపై తనకు పూర్తి నమ్మకం ఉందని విజయారెడ్డి అన్నారు. కోర్టు విచారణలో దానం నాగేందర్ ఎన్నిక చెల్లదని తేలితే, ఆ స్థానంలో తననే ఎమ్మెల్యేగా ప్రకటించే అవకాశం ఉందని ధీమా వ్యక్తం చేశారు. తన వాదనను కోర్టు అంగీకరిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.

ఎన్నికల పిటిషన్‌పై తీర్పు రాకుండా ఉప ఎన్నిక నిర్వహించవద్దని సుప్రీంకోర్టు తీర్పు కూడా ఉందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఒకవేళ తన పిటిషన్‌ను పక్కన పెడితే దానికి గల కారణాలపై మళ్లీ కోర్టును ఆశ్రయిస్తానని స్పష్టం చేశారు. ఒకవేళ ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వస్తే పార్టీ అధిష్ఠానం ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలని వ్యాఖ్యానించారు. విజయారెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజధాని రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.