బాహుబలి, పుష్ప తర్వాత పాన్ ఇండియాలో టాలీవుడ్ పేరు మార్మోగుతోంది. దేశంలోనే అత్యధిక సినిమాలు నిర్మించే చిత్రపరిశ్రమలలో మనదీ ఒకటి. ఏటా వందల్లో సినిమాలు తీస్తున్న చెప్పుకోదగ్గ విజయాలు ఉండడం లేదు. ఈ ఏడాది ప్రథమార్థం పూర్తి నిరాశాజనకమేనని చెప్పుకోవాలి.
క్యాలెండర్ తిరగేస్తే వారానికి రెండు మూడు సినిమాలు, పండగలకు క్యూ కట్టిన భారీ ప్రాజెక్టులతో థియేటర్లు కళకళలాడాయి. చిన్న సినిమాల నుంచి స్టార్ హీరోల చిత్రాల వరకు ఈ ఏడాది దాదాపు 110 సినిమాలు బాక్సాఫీస్ బరిలోకి దిగాయి. అయితే సంఖ్య పరంగా పరిశ్రమ ఆర్భాటం చేసినప్పటికీ, విజయాల శాతం మాత్రం దారుణంగా పడిపోయింది. ట్రేడ్ వర్గాల తాజా విశ్లేషణల ప్రకారం, ఈ వందకు పైగా చిత్రాలలో ప్రేక్షకుల నమ్మకాన్ని గెలుచుకుని, కమర్షియల్ సక్సెస్ సాధించిన సినిమాలు కేవలం నాలుగు మాత్రమే కావడం గమనార్హం.
బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన ఆ నాలుగు చిత్రాలుగా ‘మన శంకర్ వరప్రసాద్ గారు’, ‘అనగనగా ఒక రాజు’, ‘నారీ నారీ నడుమ మురారి’, ‘మా ఇంటి బంగారం’ నిలిచాయి. ఈ సినిమాల విజయ సూత్రాన్ని పరిశీలిస్తే, ఇవన్నీ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ల మీదో లేదా వందల కోట్ల గ్రాఫిక్స్ హంగుల మీదో ఆధారపడలేదు. ప్రేక్షకుల హృదయాలను తాకే బలమైన కథ, కుటుంబం మొత్తం కలిసి చూడదగ్గ క్లీన్ వినోదం, రూట్ కనెక్టెడ్ ఎమోషన్స్ ఈ చిత్రాలను విజయతీరాలకు చేర్చాయి. స్టార్‌డమ్ లేదా బడ్జెట్ మాత్రమే విజయానికి సరిపోవని, మంచి కంటెంట్ ఉంటేనే ఆదరిస్తామని తెలుగు ప్రేక్షకులు మరోసారి నిరూపించారు.
మరోవైపు మిగిలిన 106 సినిమాలు ఘోరంగా వెనుకబడటానికి రొటీన్ ఫార్ములా కథలే ప్రధాన కారణం. ఓటీటీల పుణ్యమా అని ప్రపంచ సినిమాను చూస్తున్న నేటి ప్రేక్షకులకు, పాత చింతకాయ పచ్చడి లాంటి స్క్రీన్‌ప్లేలు ఏమాత్రం నచ్చలేదు. కేవలం హీరో ఇమేజ్, మాస్ ఎలివేషన్లను నమ్ముకుని వచ్చిన పెద్ద సినిమాలు కూడా ఈ ఏడాది ఘోర పరాజయాన్ని చవిచూశాయి. 2026 టాలీవుడ్‌కు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇచ్చింది. సినిమా విజయాన్ని నిర్ణయించేది బడ్జెట్ లేదా స్టార్‌డమ్ కాదు, కేవలం కథ మాత్రమేనని ఈ ఏడాది రుజువైంది. ఇప్పటికైనా మేకర్స్ సంఖ్య కంటే నాణ్యతపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
