ఆధ్యాత్మికతకు అర్థం తెలియని దారుణమైన ప్రచార పర్వంలో నేడు మనం కొట్టుకుపోతుండటం విధి వైచిత్రి. వితండవాదమే తప్ప విశ్లేషణ కు తావు ఉండటం లేదు. వేదాంత, శాస్త్రీయ గ్రంథాలకు వక్ర భాష్యాలు చెప్పడమే గొప్పగా, ప్రచారం, పేరు కోసం పాకులాడే ప్రవచకుల వల్ల సమాజానికి కలుగుతున్న కీడు వీరు గుర్తించడం లేదనే అనిపిస్తుంది. బహుముఖ శాస్త్ర పాండితీ ప్రతిభ కలిగిన మన పెద్దలు కాలం చేయడం, వృద్ధులు అయిపోవడంతో ఇవాల్టి సమాజానికి దిశా నిర్దేశం కరువవుతోంది. మన రామాయణ, భారత, భాగవత, భగవద్గీతకు ఎవరికి తోచిన భాష్యం చెప్పేస్తున్నారు నేటి స్వయం ప్రకటిత ప్రవచకులు, స్వయం ప్రకటిత గురువులు. అందరూ అలా ఉన్నారని కాదు. కాస్తంత డొక్క శుద్ధి ఉన్నవాళ్ళు కూడా ఎవరికి తోచిన భాష్యాలు, ప్రవచనాలు వల్లించేస్తున్నారు. మన పూర్వీకులు పవిత్ర గ్రంథాలకు ఎన్నో భాష్యాలు చెప్పారు. అవేవీ మూల గ్రంథాలను దెబ్బతీయలేదు. కానీ ఈ రోజు ఒకటి రెండు గ్రంథాలు చదివి తమ పాండిత్యానికి తిరుగులేదనే భ్రమలో పడి కొందరు ప్రవచకులుగా, బ్రహ్మశ్రీలుగా మారుతున్నారు. ఇదొక వైపరీత్యం. ఒక గురువు మరో గురువును తృణీకరిస్తారు. ఆత్మవిద్య తెలిసి, మనకు ఆత్మానుభవం కలిగించేవాడే నిజమైన గురువు. శిష్యులను ఎన్నో విధాల పరీక్షించి వర్ణాశ్రమాల వైపు పంపేవారు నాటి గురువులు. అన్నింటికీ తట్టుకున్న వారికి క్షణాల్లో ఆత్మవిద్య బోధించే వారు. నేడు రేట్లు పెట్టి మరీ శక్తి పాతాలు చేస్తున్నారు. తులాభారాలు, పాదపూజలు చేయించుకుంటున్న వారూ ఉన్నారు. నా ప్రవచనానికి డబ్బులిచ్చే వాళ్లు ఉంటే చాలు.. ఎవరు విన్నా వినకపోయినా ఫరవాలేదు అని ఇటీవల ఒక ప్రవచనకర్త చెప్పడం నేటి ప్రవచకుల నైజాన్ని బయటపెడుతుంది. మన పూర్వ ఋషులు, మహర్షులు, గురువులు, ప్రామాణికులు ఇలా చేసిన సందర్భాలు కనబడవు.
ధర్మం ఆయా యుగాలను బట్టి, సంఘ కట్టుబాట్లను బట్టి, సామాజిక పరిస్థితులను బట్టి మారుతుంది. సత్యం మారదు. తనకంటే రెండు, మూడు రెట్లు చిన్న వయస్సున్న బాలికను పెళ్లాడాలని నాటి మనుస్మృతి అప్పటి కాలానికి సరైనదే. ఆ కాలంలో పరాయి పాలకులు ఆడపిల్లలను ఎత్తుకుపోయి అత్యాచారాలు చేసేవారు. తాళి కనబడితే అలాంటి వాటిని అడ్డుకోవచ్చని చిన్నప్పుడే బాలికలకు పెళ్లి చేయాల్సి వచ్చేంది. అప్పటికి అదే కరెక్ట్ కావచ్చు. నేటి కాలమాన పరిస్థితులకు నాటి ధర్మం పొసగదు. కాబట్టి మార్పులు చేసుకున్నాం. అంతమాత్రాన నాటి కాలంలో అనుసరించిన ధర్మం తప్పు కాదు. ఇలా ప్రతి అంశం విశ్లేషించుకున్నప్పుడే మన పూర్వీకులు చెప్పిన విషయాలు, ఆచరించిన ధర్మం గొప్పతనం తెలుస్తుంది. మన ప్రామాణికులను తప్పుపట్టడం మన ఆధ్యాత్మిక, సాంస్కృతి సంపదలను తక్కువ చేయడమే అవుతుంది. స్వధర్మం అన్నిటి కంటే గొప్పది. దానిని కాపాడితేనే నేటి తరం పురోగమిస్తోంది. మనలో మనకు చీలికలు తెచ్చే స్వయం ప్రకటిత ప్రవచకుల మాయలో పడరాదు. ఆత్మజ్ఞానం తెలిసిన వారే ప్రవచకులుగా, గురువుగా అనిపించుంటారు. అలాంటి వారిని అన్వేషించి పట్టుకోవడం అంత సులువు కాదు. అది కూడా మన పురాకృత సుకృతమే.
ఆదూరి వెంకటేశ్వర రావు
+91 98664 93074
