అందరికీ ఆత్మజ్ఞానం కావాలి, మోక్షం లభించాలి. కానీ, ఇవేవీ అంగడిలో కొనుక్కునే సరుకులు కావు. ‘మేము జ్ఞానాన్ని ఇస్తాం’ అని నమ్మబలికే దొంగ గురువులను నమ్మి మోసపోవడానికి నేటి సమాజం సిద్ధపడుతోంది. నిజానికి, ఆత్మజ్ఞానులైన సద్గురువులను ఆశ్రయించి, వారి కృపను పొందితేనే జ్ఞాన సాధన సాధ్యమవుతుంది. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినట్లు—”శ్రద్ధ, ఇంద్రియ నిగ్రహం” ఉన్నవాడే జ్ఞానాన్ని పొందడానికి అర్హుడు.
అయితే, ఈ రెండూ సాధించలేక చేతులెత్తేసే కొందరు, షార్ట్కట్ మార్గాల కోసం బోధ గురువులను ఆశ్రయించి తమ కాలంతో పాటు సంపదను కూడా పోగొట్టుకుంటున్నారు. ఒక భక్తుడు ఒక పీఠాధిపతిని నమ్మి ఎకరం పొలం రాసిస్తే, చివరకు ఆ ఆస్తి పరాయిపాలై వాపోవాల్సి వచ్చింది. తీరా ఆస్తి తగాదా తీర్చమని కోరితే, సదరు స్వాముల వారు తనతో కలిపి ఐదు వాటాలు వేయమని సలహా ఇచ్చారు! అందుకే తనకు మాలిన ధర్మం కూడదు; మన అర్హతను గుర్తించే గురువులనే ఆశ్రయించాలి.
కేవలం గురువులే శిష్యులను పరీక్షించడం కాదు, వివేకానందుడు రామకృష్ణ పరమహంసను ప్రశ్నించి స్వీకరించినట్లుగా.. శిష్యుడు కూడా గురువును నిశితంగా పరిశీలించాలి. సాధకుడు మొదట తన సంసార బాధ్యతలను చక్కబెట్టుకోవాలి. తామరాకుపై నీటిబొట్టులా సంసారంలో ఉంటూనే, సన్యాస ధర్మాలను పాటిస్తూ దేనికీ బంధీ కాకూడదు. చివరకు జగద్గురువైన కృష్ణ భగవానుని శరణువేడితే, ఆయన కర్తవ్య బోధ చేసి మన మార్గాన్ని నిష్కళంకం చేస్తారు. హృదయంలో నిజమైన భక్తి, నమ్మకం లేనిదే ముక్తి సాధ్యం కాదు!
అంతరంగ తరంగం
ఆడూరి వేంకటేశ్వర రావు
+91 98664 93074
