హైదరాబాద్ లాంటి మహానగరాలు రూపుదిద్దుకోవడానికి 400 ఏళ్లు పట్టింది కదా, ‘అమరావతి’ పదేళ్లలో ఎలా సాధ్యం? అనేవాళ్లకు ఈ కథనం బలమైన సమాధానం.
షెన్‌జెన్.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను తనదైన శైలిలో నడిపిస్తున్న చైనా తీర్చిదిద్దిన అద్భత నగరం. ఇది 1980లలో ఒక చిన్న మత్స్యకారుల గ్రామం. అక్కడి జనాభా కేవలం 3000 మాత్రమే. ఈ రోజు, ఇది స్మార్ట్‌ఫోన్‌ల నుంచి డ్రోన్‌ల వరకు ప్రతిదానిని తయారు చేస్తుంది. ప్రపంచంలోని అతిపెద్ద సాంకేతిక సంస్థలకు నిలయంగా ఉంది. ఇది ఎలా సాధ్యమైంది? చైనా కేవలం భవనాలను నిర్మించలేదు, అది ఒక Ecosystem ను నిర్మించింది. కర్మాగారాలు, ఓడరేవులు, విద్యుత్ ప్లాంట్లు, ఎక్స్‌ప్రెస్‌వేలు, విశ్వవిద్యాలయాలు, కార్మికుల గృహాలు, పారిశ్రామిక పార్కులు, పరిశోధనా కేంద్రాలు, ఆర్థిక ప్రోత్సాహకాలు, లాజిస్టిక్స్ కారిడార్లు.. ఇలా ప్రతి ఒక్కటీ మరొక దానితో అనుసంధానమై ఉండడంతో షెన్‌జెన్ అద్భత నగరంగా నిర్మాణమైంది. దీంతో ఒక కార్మికుడు ఉపాధి కోసం వందల కిలోమీటర్లు ప్రయాణించాల్సిన అవసరం రాలేదు. ఒక సప్లయర్ మరో రాష్ట్రానికి మారాల్సిన పని లేకుండా పోయింది. ఒక తయారీదారు (Manufacturer) మౌలిక సదుపాయాల కోసం ఏళ్ల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేకుండా పోయింది. అక్కడ ప్రతీదీ కలిసే వృద్ధి చెందింది. ఈ నగరం ఉత్పత్తి (Production) చుట్టూ డిజైన్ అయ్యింది కానీ, జనాభా (Population) చుట్టూ కాదు.
తాజాగా ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి(Amaravati) నిర్మాణం కూడా ఇదే తరహాలో సాగుతోంది. చైనాలోని షెంజెన్ ఆర్థిక నమూనాతో సరితూగేలా అమరావతి ప్రయాణం సాగుతోంది. ఒక గొప్ప నగరం కేవలం ప్రజలు నివసించే ‘రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్’ కాదని, అది సంపదను సృష్టించే ఒక ‘ఆర్థిక ఇంజిన్’ అని షెంజన్ సిటీ నిరూపించింది. ఈ సూత్రం ఆధారంగా చూస్తే, అమరావతి అతి త్వరితగతిన సాకారం కావడం సత్యం.. సజీవం.
బాంబే, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ ఇలా.. చాలా నగరాలు జనాభా పెరిగిన తర్వాత రోడ్లు, డ్రైనేజీలు, రవాణా సౌకర్యాల కోసం వెతుక్కుంటున్నాయి. కానీ, అమరావతికి ఉన్న అతిపెద్ద శక్తీ, వరమూ ఏంటంటే.. ఇది ఒక ‘గ్రీన్‌ఫీల్డ్ నగరం’. అంటే, శూన్యం నుంచి ఆధునిక ప్రణాళికతో నిర్మిస్తున్న మహానగరం. ఇక్కడ ఇళ్లు రాకముందే అండర్‌గ్రౌండ్ డక్ట్ సిస్టమ్, ఐకానిక్ రహదారులు, జోనింగ్ వంటివి అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకుంటున్నాయి. పరిశ్రమలు ఎక్కడ ఉండాలి? ఐటీ హబ్ ఎక్కడ రావాలి? నివాస ప్రాంతాలు ఎక్కడ ఉండాలనేది ముందే డిజైన్ చేశారు.
నిపుణుల విశ్లేషణల ప్రకారం.. భవనాలు కేవలం ఫొటోలకే పరిమితం అవుతాయి, కానీ వ్యవస్థలు (Systems) మాత్రమే స్థిరమైన ప్రగతిని ఇస్తాయి. అమరావతి కేవలం సచివాలయం, అసెంబ్లీ వంటి పరిపాలనా భవనాలకే పరిమితం కావడం లేదు. ఇప్పటికే ఇక్కడ SRM, VIT వంటి ప్రతిష్టాత్మక యూనివర్సిటీలు యాంకర్ ఇన్‌స్టిట్యూషన్స్‌గా నిలిచాయి. ఇవి రేపటి తరం ఐడియాలను, ఆవిష్కరణలను ఫ్యాక్టరీలుగా మార్చే విద్యా పర్యావరణాన్ని (Educational Ecosystem) సృష్టిస్తున్నాయి. దీనికి తోడు మంగళగిరి, గన్నవరం, జగ్గయ్యపేట బెల్ట్ మీదుగా రాబోయే పరిశ్రమలు, మచిలీపట్నం వంటి సమీప పోర్టుల కనెక్టివిటీ అమరావతిని ఒక అజేయమైన సప్లై చైన్ హబ్‌గా మార్చబోతున్నాయి.
ప్రజాస్వామ్య దేశంలో భూసేకరణ, రాజకీయ హెచ్చుతగ్గులు వంటి సవాళ్లు సహజం. కానీ ‘ల్యాండ్ పూలింగ్’ ద్వారా వేల మంది రైతులను భాగస్వాములను చేస్తూ ఆంధ్రప్రదేశ్ సృష్టించిన మోడల్ భారతదేశ చరిత్రలోనే అద్వితీయం. సవాళ్లను అధిగమిస్తూ, పాలకుల దృఢ సంకల్పం, ప్రజల ఆకాంక్షలు తోడై అమరావతి ఇప్పుడు వేగంగా అడుగులు వేస్తోంది.
అమరావతి(Amaravati) కేవలం కాంక్రీట్ కట్టడం కాదు; అది ఆంధ్రుల ఆత్మగౌరవం, భవిష్యత్ తరాల ఆర్థిక సుస్థిరత. చీమల కాలనీ తరహాలోనే రైల్వేస్, పోర్ట్స్, పరిశ్రమలు, విద్యుత్, మానవ వనరులు ఒకదానికొకటి సపోర్ట్ చేసుకునేలా డిజైన్ చేయబడిన ఈ నగరం, భారతదేశంలోనే అత్యంత విజయవంతమైన ఆధునిక నగరంగా నిలబడటం ఖాయం. అమరావతి కల కాదు.. అతి త్వరలోనే మన కళ్ల ముందు సాకారమవబోతున్న అద్భుత వాస్తవం!
