SIR: ఓటరు జాబితాలో ప్రతి అర్హుడికీ చోటుండాలి: మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి

brs-leader-manchireddy-prashanth-kumar-reddy-voter-registration-drive

ఇబ్రహీంపట్నం, మినిట్ 2 మినిట్ న్యూస్:  అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా బీఆర్ఎస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్లు (BLA) సైనికుల్లా పని చేయాలని పార్టీ రాష్ట్ర నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి (బంటీ) పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

నియోజకవర్గంలో జరుగుతున్న ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ ప్రక్రియలో భాగంగా 18 ఏళ్లు నిండిన యువతీ యువకుల నూతన ఓట్ల నమోదుపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. BLAలు, గ్రామ అధ్యక్షులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ, బూత్ లెవల్ అధికారులతో (BLO) కలిసి సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాల సేకరణ, ఫారాల పంపిణీ, పత్రాల పరిశీలన వంటి అంశాలను పర్యవేక్షించాలన్నారు. ఓటరు జాబితాను దోషరహితంగా మార్చేందుకు… మరణించిన వారి, వలస వెళ్లిన వారి పేర్ల తొలగింపును అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం, ప్రజలతో మర్యాదగా వ్యవహరిస్తూ ఈ బాధ్యతను విజయవంతం చేయాలని శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.