వనస్థలిపురం: ప్రజానేత వంగవీటి మోహనరంగా 79వ జయంతిని పురస్కరించుకుని శనివారం స్థానిక కాపు సంక్షేమ భవన్‌లో ఆయన కాంస్య విగ్రహాన్ని వైభవంగా ఆవిష్కరించారు. కాపు సంఘం అధ్యక్షుడు ఐ.ఎస్. కోటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి పున్నయ్య నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి నగర నలుమూలల నుంచి కాపు ప్రముఖులు, యువత భారీగా తరలివచ్చారు.
ఈ సందర్భంగా వక్తలు వంగవీటి రంగా సమాజానికి చేసిన సేవలను, ఆయన ఆశయాలను స్మరించుకున్నారు. కాపు సామాజిక వర్గాన్ని ఏకతాటిపైకి తెచ్చి, అన్ని రంగాల్లోనూ వారిని ముందంజలో ఉంచడమే తమ సంకల్పమని, రంగా ఆశయ సాధనకై ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అనంతరం కాపు సంఘం నాయకులు హుడా ప్రసాద్, దుర్గా విలాస్ హోటల్ అధినేత ముప్పవరపు వేంకటేశ్వరరావులను ఘనంగా సత్కరించారు. రంగా అభిమానుల రాకతో సంక్షేమ భవన్ పరిసరాలు కోలాహలంగా మారాయి.
