షాకింగ్ ట్విస్ట్.. దిగివచ్చిన బంగారం ధరలు.. నేడు హైదరాబాద్‌లో తులం పసిడి ఎంతంటే?

Gold Rates

Gold Rates

Gold Rates: గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన పసిడి పరుగులకు కాస్త బ్రేక్ పడింది. బులియన్ మార్కెట్‌లో ఉదయాన్నే పసిడి ప్రియులకు ఊరటనిచ్చే వార్త అందింది. గ్లోబల్ మార్కెట్‌లో చోటుచేసుకున్న పరిణామాలు, ఫెడ్ రిజర్వ్ నిర్ణయాల ప్రభావంతో దేశీయంగా బంగారం ధరలు స్వల్పంగా దిగివచ్చాయి. గడిచిన కొద్ది రోజులుగా వరుసగా పెరుగుతూ వచ్చిన రేట్లు ఒక్కసారిగా తగ్గడంతో కొనుగోలుదారులు కాస్త ఉపశమనం పొందుతున్నారు. ప్రధానంగా పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్న వేళ ఈ ధరల తగ్గింపు వినియోగదారులకు కొంత ఉపశమనాన్ని కలిగిస్తోంది.

హైదరాబాద్‌లో పసిడి రేట్లు.. ఎంత తగ్గాయంటే?

తెలుగు రాష్ట్రాల ప్రధాన వ్యాపార కేంద్రమైన హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు నేడు తగ్గుముఖం పట్టాయి. మేలిమి రూపమైన 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ. 600 మేర తగ్గి, ప్రస్తుతం రూ. 1,52,840 వద్ద కొనసాగుతోంది. అలాగే, ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 550 తగ్గి రూ. 1,40,100కి చేరుకుంది. విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల్లో కూడా దాదాపు ఇవే ధరలు కొనసాగుతుండగా, స్థానిక పన్నులు మరియు రవాణా ఖర్చులను బట్టి ప్రాంతాల వారీగా ఈ ధరల్లో స్వల్పంగా వ్యత్యాసాలు ఉండే అవకాశం ఉందని వర్తకులు చెబుతున్నారు.

అదే బాటలో వెండి.. కొనుగోలు చేసేటప్పుడు ఇవి గుర్తుంచుకోండి!

మరోవైపు బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా ముగిశాయి. కిలో వెండి ధర ప్రస్తుతం రూ. 2,50,000 వద్ద మార్కెట్‌లో ట్రేడ్ అవుతోంది. పసిడి ధరలు తగ్గినప్పటికీ, వినియోగదారులు ఆభరణాల షాపులకు వెళ్లేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. పైన పేర్కొన్న ధరలు కేవలం ప్రాథమిక బులియన్ మార్కెట్ రేట్లు మాత్రమే. వీటితో పాటు 3 శాతం జీఎస్టీ (GST), తయారీ కూలీ (మెంకింగ్ ఛార్జీలు) అదనంగా తోడవుతాయి. కాబట్టి బిల్లు చెల్లించే సమయానికి తుది ధరలో కొంత తేడా ఉంటుందని గమనించాలి.

ఇప్పుడే కొనాలా? మరికొద్ది రోజులు ఆగాలా?

గ్లోబల్ మార్కెట్లలో డాలర్ విలువ పుంజుకోవడం, ఇన్వెస్టర్లు ఇతర లాభదాయకమైన మార్గాల వైపు మొగ్గు చూపడంతో బంగారంపై ఒత్తిడి పెరుగుతోందని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు. అంతర్జాతీయంగా ఇదే ట్రెండ్ కొనసాగితే రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరికొంత తగ్గే అవకాశాలు లేకపోలేదని అంచనా వేస్తున్నారు. కాబట్టి పెద్ద మొత్తంలో ఆభరణాలు లేదా గోల్డ్ కాయిన్స్ కొనాలనుకునే వారు ఒకేసారి కాకుండా, విడతల వారీగా పెట్టుబడి పెట్టడం లేదా ధరలు మరికొంత స్థిరపడే వరకు మార్కెట్ సరళిని గమనించి నిర్ణయం తీసుకోవడం శ్రేయస్కరమని నిపుణులు సూచిస్తున్నారు.