‘డ్రీమ్‌గర్ల్’ అంటూ టీచర్‌ వేధింపులు.. నిలదీస్తే కత్తితో దాడి చేసిన ప్రిన్సిపాల్!

Principal Harassment

Principal Harassment

Principal Harassment: హైదరాబాద్ సూరారంలోని సాయిబాబా నగర్‌లో ఘోర సంఘటన చోటుచేసుకుంది. పాఠశాలలో విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ ప్రైవేటు స్కూల్ ప్రిన్సిపాల్ వికృత రూపం బయటపడింది. స్కూల్‌లో పనిచేసే మహిళా టీచర్ పట్ల ఆ ప్రిన్సిపాల్ అసభ్యంగా ప్రవర్తిస్తూ మానసిక, శారీరక వేధింపులకు గురిచేశాడు. సదరు టీచర్ మొబైల్ నంబరును తన ఫోన్‌లో ‘డ్రీమ్‌గర్ల్’ అని సేవ్ చేసుకుని వికృత చేష్టలకు పాల్పడ్డాడు.

ఆరా తీసిన కుటుంబ సభ్యులు!
ప్రిన్సిపాల్ వేధింపులు తాళలేక సదరు బాధిత టీచర్ స్కూల్‌కు వెళ్లడం మానేసింది. బిడ్డ మానసిక వేదనను, పాఠశాలకు వెళ్లకపోవడాన్ని గమనించిన కుటుంబ సభ్యులు ప్రేమగా ఆరా తీశారు. దీంతో ప్రిన్సిపాల్ వేధింపుల నిజస్వరూపాన్ని బాధితురాలు కంటతడి పెడుతూ కుటుంబ సభ్యులకు వెల్లడించింది. విషయం తెలుసుకున్న బాధితురాలి సోదరుడు, స్థానిక కాలనీవాసులు ఆగ్రహంతో రగిలిపోయారు.

కత్తితో దాడి చేసిన ప్రిన్సిపాల్.. కౌంటర్ దాడి!
ఘటనపై నిలదీసేందుకు బాధిత టీచర్ సోదరుడు, కాలనీవాసులు నేరుగా పాఠశాలకు వెళ్లారు. ప్రిన్సిపాల్‌ను గట్టిగా నిలదీయడంతో అతడు విచక్షణ మరచి వారిపై కత్తితో దారుణంగా దాడికి తెగబడ్డాడు. ప్రిన్సిపాల్ కత్తి దాడితో తీవ్ర ఆగ్రహానికి గురైన కాలనీవాసులు పాఠశాలపై, ప్రిన్సిపాల్‌పై మూకుమ్మడిగా దాడి చేశారు. పాఠశాల ఆవరణలో ఘర్షణ జరుగుతున్న సమాచారం అందుకున్న సూరారం పోలీసులు తక్షణమే అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. పాఠశాలలో గొడవ పడుతున్న ఇరువర్గాలను పోలీసులు స్టేషన్‌కు తరలించారు. బాధితులపై కత్తితో దాడిచేసిన ప్రిన్సిపాల్‌పై ఒక కేసు, స్కూల్‌పై దాడికి పాల్పడిన కాలనీవాసులపై మరొక కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.