రూ.620 కోట్ల స్టీల్ బ్రిడ్జ్.. ఊడుతున్న బోల్టులు!

Steel Bridge

Steel Bridge

Steel Bridge: అధికారుల పర్యవేక్షణ లోపం, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కలసి ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నాయి. సంతోష్ నగర్ మెయిన్ రోడ్డు వద్ద సుమారు రూ.620 కోట్ల భారీ వ్యయంతో నిర్మించిన సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి నాణ్యత తీరు ఇప్పుడు నగరంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఫ్లైఓవర్‌ను ప్రారంభించి నెల రోజులు కూడా కాకముందే దానికి సంబంధించిన బోల్టు నట్టు ఊడిపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వంతెనపై వేగంగా వెళ్తున్న ఒక వాహనదారుడు ఊడిపడిన నట్టును గమనించి వీడియో తీసి నెట్టింట పోస్ట్ చేయడంతో ఈ ఘోర నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది.

వేలాది వాహనాలు రోజువారీగా రాకపోకలు సాగించే ఈ కీలకమైన ఫ్లైఓవర్‌పై నాణ్యతా ప్రమాణాలు గాలికి వదిలేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రయాణిస్తున్న సమయంలో స్టీల్ భాగాలు లేదా బోల్టులు ఊడిపడి ఏ క్షణంలోనైనా ఏదైనా ప్రమాదం జరిగితే దానికి బాధ్యులు ఎవరని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కాంట్రాక్టర్ల లాభాపేక్ష, అధికారుల ఉదాసీనత వల్లే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించకుండా తక్షణమే స్పందించాలి. సైదాబాద్ స్టీల్ బ్రిడ్జిపై సమగ్రమైన సేఫ్టీ ఆడిట్ (భద్రతా తనిఖీ) నిర్వహించి, నాణ్యతా లోపాలకు కారణమైన అధికారులపై, కాంట్రాక్టింగ్ సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.