కోటి కుటుంబాలకు ఆర్థిక భరోసా.. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సెర్ప్, మెప్మా కీలక సమీక్ష!

Swayam AP

Swayam AP

Swayam AP: స్వయం సహాయక సంఘ సభ్యులు ఆర్ధికంగా బలోపేతం అయ్యేలా అన్ని శాఖలు సమన్వయంతో కలిసి పని చేయాలని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. దీనికి సెర్ప్, మెప్మా అధికారులు మద్దతుగా నిలవాలని సూచించారు. అవసరమైతే కార్పొరేట్ సంస్థల సహకారం తీసుకోవాలని నిర్దేశించారు. సంపద సృష్టికి ఎక్కడ, ఎలాంటి అవకాశాలు ఉన్నా వినియోగించుకునేలా డ్వాక్రా మహిళల్ని తీర్చిదిద్దాలన్నారు. 5 లక్షల మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా చేయడం లక్ష్యం కావాలని, స్వయం ఉపాధి పొందాలనుకునే వారు ఫ్రాంచైజీలు ప్రారంభించినా ప్రోత్సహించాలని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో కోటికి పైగా ఉన్న స్వయం సహాయక సంఘ సభ్యులు ఆర్ధికంగా బలపడితే… కోటి కుటుంబాలకు పైగా బలపడినట్టేనని సీఎం చెప్పారు. ఎంట్రప్రెన్యూర్లు ఆర్ధికంగా విజయవంతం అయినప్పుడే గుర్తింపు వస్తుందన్నారు. లక్ష మంది మహిళలు ఒకొక్కరు ఏడాదికి రూ.5 లక్షల వ్యాపారం చేయగలిగితే రూ.5,000 కోట్ల ఆర్థిక సామర్థ్యం సాధించినట్టేని సీఎం అన్నారు. క్యాంపు కార్యాలయంలో సోమవారం సెర్ప్, మెప్మా అధికారులతో 5 లక్షల మంది ఎంట్రప్రెన్యూర్లను తీర్చిదిద్దడం, స్వయం ఏపీ అంశాలపై సీఎం సమీక్షించారు. దేశంలోనే స్వయం సహాయక సంఘాలు అంతటి విస్తృతమైన వ్యవస్థ మరొక్కటి లేదని సీఎం సమీక్షా సమావేశంలో ప్రస్తావించారు. డ్వాక్రా సంఘాలు తయారు చేసే ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్ చేరుకోవాలని, అదే సమయంలో మరి కొంతమంది ఉపాధి కల్పించేలా ఎదగాలని సీఎం సూచించారు. డ్వాక్రా మహిళలు తయారు చేస్తున్న వేలాది ఉత్పత్తులకు ఒకే బ్రాండ్, నాణ్యత ప్రమాణాలు, ఆధునిక ప్యాకేజింగ్, ఈ-కామర్స్, సిగ్నేచర్ స్టోర్లు, మార్కెటింగ్ వ్యవస్థను అనుసంధానం చేస్తూ ‘స్వయం AP’ని తీర్చిదిద్దాలన్నారు. తొలిసారి విజయవాడలో ఈనెల 15 నుంచి 31 వరకు నిర్వహించ తలపెట్టిన ‘నేషనల్ సరస్ మేళా 2026’ను విజయవంతం చేయాలని… మహిళా సాధికారత చాటేలా సరస్ మేళా నిర్వహించాలని అధికారులను సీఎం ఆదేశించారు. దీనికి దేశవ్యాప్తంగా ఉన్న మహిళా ఎంట్రప్రెన్యూర్లను, మహిళా ఎంపీలను ఆహ్వానించాలని నిర్దేశించారు. మరోవైపు సరస్ మేళాకు దేశం నలుమూలల నుంచి వివిధ స్వయం సహాయక సంఘాలు 600 స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నాయని అధికారులు వివరించారు. మేళాకు రోజూ లక్ష మంది వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధికారికంగా 15న ప్రారంభిస్తున్నారని తెలిపారు.

*అక్టోబర్ 15 నుంచి ‘స్వయం ఏపీ’ విక్రయాలు*

అక్టోబర్ 15 నుంచి సిగ్నేచర్ స్టోర్లు, ఫ్లిప్‌కార్ట్‌లో ‘స్వయం AP’ ఉత్పత్తుల విక్రయాలు ప్రారంభిస్తున్నట్టు సమీక్షలో అధికారులు వెల్లడించారు. బ్యాంక్ లింకేజీలోనూ రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘ సభ్యులు ముందున్నారని తెలిపారు. రాష్ట్రంలో 5 లక్షల మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యానికి అనుగుణంగా ఇప్పటికే చేపట్టిన కార్యక్రమాలు, మార్కెట్ అనుసంధానం, ఆర్థిక వనరులు, శిక్షణ, నాణ్యత ప్రమాణాల గురించి అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. గ్రామం నుంచి గ్లోబల్‌ మార్కెట్‌ వరకు మహిళలకు అండగా బలమైన వ్యవస్థ నెలకొల్పడం… అవకాశాలను గుర్తించి వ్యాపారాలుగా మలిచే కార్యాచరణ చేపట్టడం… రూ.68,585 కోట్ల రుణాలతో మహిళలకు ఆర్థిక మద్దతివ్వడం… మహిళల్లో కెపాసిటీ బిల్డింగ్, వ్యాపార నిర్వహణ కోసం ప్రముఖ సంస్థలతో శిక్షణ అందించడం… 60కి పైగా సంస్థల భాగస్వామ్యంతో సమగ్ర పారిశ్రామిక ప్రణాళిక రూపొందించడం… ఈ ఐదు ప్రధాన అంశాలతో మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేలా ప్రణాళికలు రూపొందించినట్టు చెప్పారు. ఇప్పటికే వ్యాపారంలో విజయవంతమైన మహిళలను కొత్తగా వ్యాపారంలోకి వచ్చే మహిళలకు మెంటర్లుగా అనుసంధానం చేస్తున్నట్టు తెలిపారు. 5 లక్షల మంది మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా చేసేందుకు జిల్లా స్థాయిలో ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

*గ్రామీణ మహిళా వ్యాపారులకు మద్దతు*

గ్రామీణ మహిళా వ్యాపారాలను చిన్న స్థాయి జీవనోపాధి కార్యకలాపాల నుంచి సంపద సృష్టించే సంస్థలుగా మార్చేందుకు ఇంక్యుబేషన్ కార్యక్రమాలు చేపడుతున్నట్టు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఐఐఎం విశాఖపట్నం, సెంచూరియన్ యూనివర్సిటీ వంటి సంస్థలతో కలిసి మహిళా వ్యాపారాలకు మెంటార్‌షిప్, మార్కెట్, రుణం, వనరులు, వ్యాపార నైపుణ్యాల అనుసంధానం చేస్తున్నామన్నారు. మహిళల సొంత బ్యాంకింగ్ సంస్థగా ఉన్న స్త్రీనిధి ద్వారా 4.73 లక్షల మంది మహిళలకు రూ.4,800 కోట్ల రుణాలు అందించామని తెలిపారు. ఎస్‌హెచ్‌జీ మహిళలు ఇప్పటికే ఆహారం, హస్తకళలు, వస్త్రాలు తదితర రంగాల్లో 23,000కు పైగా ఉత్పత్తులు తయారు చేస్తున్నట్టు అధికారులు చెప్పారు. ఈ సమావేశంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.