Instamart exploit: క్విక్ కామర్స్ పేరిట నిమిషాల్లో సరుకులు అందిస్తున్నామని గొప్పలు చెప్పుకునే ‘ఇన్‌స్టామార్ట్’ (క్విక్ బాక్స్ రిటైల్ ప్రైవేట్ లిమిటెడ్) అసలు రూపం తాజాగా వెలుగులోకి వచ్చింది. మినిట్ 2 మినిట్ పరిశోధనలో హస్తినాపురంలోని సత్యదేవ్ ఎన్‌క్లేవ్‌లో ఉన్న డార్క్ స్టోర్‌లో దారుణ పరిస్థితులు బయటపడ్డాయి. ఒకపక్క ఇక్కడి అపరిశుభ్రవాతావరణం, కాలం చెల్లిన పదార్థాలు ఆందోళనకు గురి చేస్తుంటే.. మరోపక్క సరైన మౌలిక సదుపాయాలు లేక, కనీస మానవత్వమూ కానరాక డెలివరీ రైడర్లు అల్లాడిపోతున్నారు. సకల అవస్థలు పడుతూ కష్టపడే రైడర్లను ఇక్కడి స్టోర్ మేనేజ్మెంట్ పురుగుల్లా చూస్తోందని, నిత్యం బెదిరింపులకు పాల్పడుతోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
రైడర్లపై బెదిరింపుల పర్వం
స్టోర్లలో తాగునీరు, కనీస వాష్‌రూమ్ సదుపాయాలు కూడా కరువయ్యాయి. పని ఒత్తిడిలో తమ హక్కులను ప్రశ్నించే రైడర్లను ఐడీలు బ్లాక్ చేస్తామని బెదిరించడం స్టోర్ మేనేజర్‌కు నిత్యకృత్యంగా మారింది. ఇటీవల ఒక రైడర్ విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు కిందపడి తీవ్రంగా గాయపడితే, తోటి రైడర్లు గట్టిగా నిలదీసే వరకు కనీస వైద్యం కూడా చేయించకపోవడం యాజమాన్య నిర్లక్ష్యానికి పరాకాష్ట. తీవ్ర నడుం నొప్పితో ఇంకా బాధపడుతున్నానని, కనీసం మనుషుల్లా కూడా చూడడం లేదని బాధిత రైడర్ ‘మినిట్ 2 మినిట్’ వద్ద కన్నీటిపర్యంతమయ్యాడు.
నాణ్యత కరువు.. ప్రమాదకర వాతావరణం
హస్తినాపురం సత్యదేవ్ ఎన్‌క్లేవ్‌లోని ఈ స్టోర్ మొదటి అంతస్తులో ఉండడంతో మెట్లు ఎక్కి దిగలేక దివ్యాంగులైన రైడర్లు నరకం చూస్తున్నారు. వీరికి ఎలాంటి సాయమూ అందడం లేదు. ఎంట్రన్స్ బోర్డులపై బూజు పట్టి, అత్యంత అపరిశుభ్ర వాతావరణం దర్శనమిస్తోంది. నిబంధనల ప్రకారం ఉండాల్సిన ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు ఇక్కడ మచ్చుకైనా కానరావు. దీనికితోడు కాలం చెల్లిన (ఔట్ డేటెడ్) ఆహార పదార్థాలను విక్రయిస్తూ వినియోగదారుల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు.
ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏం చేస్తున్నారు?
ఇంతటి అరాచకం రాజ్యమేలుతున్నా ఫుడ్ సేఫ్టీ అధికారులు, సంబంధిత శాఖలు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బూజు పట్టిన వాతావరణం, ఎక్స్పైరీ ఉత్పత్తులు, రక్షణ లేని స్టోర్లు కనిపిస్తున్నా తనిఖీలు ఎందుకు చేయడం లేదు? అధికారుల ఈ నిర్లక్ష్యానికి కారణమేంటి? తక్షణమే హస్తినాపురంలోని ఈ ఇన్‌స్టామార్ట్ స్టోర్‌పై కఠిన చర్యలు తీసుకోకపోతే ప్రజా ఆరోగ్యం ప్రమాదంలో పడటం ఖాయమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
