మంటల విలయానికి ‘రెండు నిమిషాల’ మంత్రం.. సజ్జనార్ కీలక సూచనలు!

Fire Safety

Fire Safety

Fire Safety:  ఇటీవలి కాలంలో నగరంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా అగ్నిప్రమాదాలు తరచూ చోటుచేసుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. చిన్నపాటి నిర్లక్ష్యం, కనీస అవగాహన లేకపోవడం వల్ల నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోవడమే కాకుండా, భారీగా ఆస్తి నష్టం వాటిల్లుతోంది. ఈ నేపథ్యంలో ప్రజల భద్రతే పరమావధిగా భావిస్తున్న పోలీస్ యంత్రాంగం, ప్రమాదాల నివారణపై విస్తృతంగా అవగాహన కల్పిస్తోంది. తాజాగా సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ ‘ఎక్స్’ వేదికగా అగ్నిప్రమాదాలను ఎలా అరికట్టవచ్చో వివరిస్తూ ప్రజలకు కీలక సూచనలు చేశారు.

తొలి రెండు నిమిషాలే ప్రాణరక్ష!

ఏదైనా అగ్నిప్రమాదం సంభవించినప్పుడు మొదటి రెండు నిమిషాల సమయం అత్యంత కీలకమని సజ్జనార్ స్పష్టం చేశారు. ఆ సమయంలో భయాందోళనకు గురికాకుండా, సరైన ఫైర్ ఎక్స్‌టింగ్విషర్‌తో మంటలను అదుపు చేయగలిగితే పెను ప్రమాదాన్ని నివారించవచ్చని పేర్కొన్నారు. అయితే, మంటల స్వభావాన్ని బట్టి ఏ రకమైన పరికరాన్ని ఎంచుకోవాలో, దాన్ని ఎలా వినియోగించాలో ఇంటిల్లిపాదికీ తెలిసి ఉండటం ఎంతో ముఖ్యమని సూచించారు.

భద్రతా ప్రమాణాలు పాటిస్తేనే రక్షణ

ప్రతి ఇంట్లో, వ్యాపార సముదాయాలు, కార్యాలయాల్లో కచ్చితంగా ఐఎస్ఐ మార్క్ ఉన్న నాణ్యమైన ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లను అందుబాటులో ఉంచుకోవాలని పోలీస్ శాఖ సూచిస్తోంది. వాటిని కేవలం అలంకారప్రాయంగా ఉంచకుండా, ఎప్పటికప్పుడు పనిచేస్తున్నాయో లేదో తనిఖీ చేయించుకోవాలని సజ్జనార్ తెలిపారు. ప్రజలను అప్రమత్తం చేసేందుకు పోలీసులు నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ, ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా భద్రతా నియమాలను పాటించినప్పుడే ప్రమాదాలకు అడ్డుకట్ట పడుతుంది. ఎక్కడైనా అగ్నిప్రమాదం జరిగితే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే 101 లేదా 112 అత్యవసర నంబర్లకు కాల్ చేసి సమాచారం అందించాలని ఆయన కోరారు.