Cab Driver: రేయింబవళ్లు కష్టపడి ప్రజలను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చే క్యాబ్ డ్రైవర్ల ప్రాణాలకు నగరంలో రక్షణ కరువవుతోంది. తాజాగా వనస్థలిపురం పరిధిలో చోటుచేసుకున్న దారుణ ఘటన ఇందుకు నిదర్శనంగా నిలిచింది. స్థానిక ఎఫ్‌సీఐ కాలనీకి చెందిన క్యాబ్ డ్రైవర్ రమేష్ (39), పెట్రోల్ బంకు ఎదుట ఉన్న రోడ్డు పక్కన కారు ఆపి కాసేపు సేదతీరుతుండగా దుండగులు ఒక్కసారిగా దాడికి తెగబడ్డారు. వారిని ప్రతిఘటించే క్రమంలో రమేష్ పెనుగులాడగా, దుండగులు కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి అతని సెల్‌ఫోన్‌ను అపహరించుకుని పరారయ్యారు. రక్తపు మడుగులో ఉన్న బాధితుడిని స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది.
పోలీసుల నిఘా ఏమవుతోంది?
రాజధాని పరిధిలో ప్రధాన రహదారులపైనే ఇలాంటి దారుణాలు జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారనే ప్రశ్నలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. కేవలం ఘటన జరిగిన తర్వాత సీసీ కెమెరాలు పరిశీలించి నిందితులను పట్టుకుంటామని చెప్పడం కంటే, అసలు నేరాలు జరగకుండా ముందస్తు నిఘా పెట్టడంలో యంత్రాంగం ఎందుకు విఫలమవుతోందని క్యాబ్ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రిపూట గస్తీని ముమ్మరం చేసి, అసాంఘిక శక్తుల ఆటకట్టించడంతో పాటు, క్యాబ్ డ్రైవర్ల భద్రతకు భరోసా కల్పించాలని బాధిత కుటుంబాలు, డ్రైవర్ల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
