1980s AI ట్రెండ్’ చేస్తున్నారా..? ఒక్క క్లిక్‌తో మీ బ్యాంక్ ఖాతా ఖాళీ!

AI Trend

AI Trend

AI Trend: మినిట్ 2 మినిట్, హైదరాబాద్ (సెప్టెంబర్ 10): నెటిజన్లను ఆకట్టుకునేందుకు సోషల్ మీడియాలో రోజుకో కొత్త ట్రెండ్ పుట్టుకొస్తోంది. ప్రస్తుతం నెట్టింట ‘1980s వింటేజ్ ఫొటో ట్రెండ్’ హవా నడుస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాధనాలను ఉపయోగించి యూజర్లు తమ ఫొటోలను 1980ల నాటి హెయిర్ స్టైల్, దుస్తుల శైలికి మార్చుకుని సామాజిక మాధ్యమాల్లో డిస్‌ప్లే పిక్చర్లుగా, స్టేటస్‌లుగా అప్‌లోడ్ చేస్తున్నారు. అయితే ఈ కొత్త సరదాను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు అమాయక నెటిజన్లను బురిడీ కొట్టించేందుకు కొత్త ప్లాన్ వేశారు.

అప్రమత్తంగా ఉండకపోతే ఖాతాలు ఖాళీ!
ప్రముఖ ఏఐ సాధనాలైన చాట్‌జీపీటీ వంటి వేదికల్లో ఉచిత వినియోగానికి పరిమితులు ఉండటం, అనుకున్న అవుట్‌పుట్ త్వరితగతిన రాకపోవడంతో యూజర్లు ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు. ఈ బలహీనతను ఆసరాగా చేసుకుంటున్న కేటుగాళ్లు ‘1980s AI Trend’ పేరిట నకిలీ యాప్‌లు, థర్డ్ పార్టీ వెబ్‌సైట్లు, ఏపీకేఫైళ్లను సృష్టిస్తున్నారు. వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్‌లు, ఇతర సోషల్ మీడియా వేదికల్లో వీటి లింకులను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

ఫోన్ డేటా మొత్తం చోరీ.. తస్మాత్ జాగ్రత్త
ఈ నకిలీ ఏపీకే ఫైళ్లను డౌన్‌లోడ్ చేసి ఫోన్లలో ఇన్‌స్టాల్ చేయగానే హ్యాకర్లకు మన డివైజ్‌పై పూర్తి నియంత్రణ లభిస్తుంది. ప్రైవేట్ ఫోటోలు, కాంటాక్ట్స్, గ్యాలరీలోని పూర్తి వివరాలతో పాటు బ్యాంకింగ్ యాప్‌ల వివరాలు, ఓటీపీలను సైతం క్షణాల్లో దొంగిలిస్తున్నారు. అనంతరం ఈ సమాచారంతో బెదిరింపులకు దిగడమే కాకుండా ఖాతాల్లోని డబ్బును కాజేస్తున్నారు. అపరిచిత వనరుల నుంచి వచ్చే ఏపీకే ఫైళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ డౌన్‌లోడ్ చేయకూడదని, కేవలం గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్ స్టోర్ వంటి అధికారిక మార్గాల ద్వారా లభించే నమ్మకమైన యాప్‌లనే వాడాలని సైబర్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.