Kokapet Auction: హైదరాబాద్‌లోనే అత్యంత ప్రీమియం ప్రాంతమైన కోకాపేట భూముల ఆన్‌లైన్ వేలంలో ఈసారి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. నియోపొలిస్‌లోని భారీ ప్లాట్‌కు నిర్వహించిన వేలానికి ఆశించిన స్థాయిలో పోటీ రాకపోగా, సమీపంలోని గోల్డెన్ మైల్ సైట్‌లో ఉన్న చిన్న ప్లాట్‌కు మాత్రం భారీ డిమాండ్ కనిపించింది. ఒకే ప్రాంతంలో ఉన్న భూములకు వేలంలో ఇలా భిన్నమైన స్పందన లభించడం రియల్ ఎస్టేట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
గండిపేట మండలం కోకాపేట నియోపొలిస్‌లోని సర్వే నంబర్లు 239, 240 పరిధిలో ఉన్న 4.59 ఎకరాల ప్లాట్ నంబర్ 17కు HMDA తాజాగా వేలం నిర్వహించింది. అయితే ఈ భారీ ప్లాట్‌కు కేవలం ఒకే ఒక్క బిడ్ మాత్రమే దాఖలైంది. దాంతో పోటీ లేకపోవడంతో కనీస ధర అయిన ఎకరాకు రూ. 120 కోట్లకే ప్లాటు కేటాయించాల్సి వచ్చింది. ఈ ప్లాట్ ద్వారా ప్రభుత్వానికి సుమారు రూ. 550.8 కోట్ల ఆదాయం సమకూరింది. గతంలో నిర్వహించిన వేలంలో ఇదే ప్లాట్‌కు ఎకరాకు రూ. 136 కోట్ల రికార్డు ధర పలికినప్పటికీ, సంబంధిత బిడ్డర్ గడువులోగా సొమ్ము చెల్లించకపోవడంతో HMDA మళ్లీ వేలం వేసింది. ఈసారి తక్కువ ధరకు అమ్ముడుపోవడం అధికారులను కొంత నిరాశకు గురిచేసింది.
మరోవైపు కోకాపేట పరిధిలోని గోల్డెన్ మైల్ సైట్-1లో ఉన్న 0.70 ఎకరాల ప్లాట్‌కు మాత్రం గట్టి పోటీ నెలకొంది. కనీస ధర ఎకరాకు రూ. 70 కోట్లుగా నిర్ణయించగా, బిడ్డర్లు పోటీ పడటంతో అత్యధికంగా ఎకరాకు రూ. 115 కోట్ల బిడ్ నమోదైంది. కనీస ధర కంటే చాలా ఎక్కువ మొత్తానికి ఈ భూమి వేలంలో పలికింది. నియోపొలిస్ ప్లాట్‌కు ఆశించిన స్థాయిలో ధర రాకపోయినప్పటికీ, ఔటర్ రింగ్ రోడ్డు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైటెక్ సిటీకి ఉన్న అద్భుతమైన కనెక్టివిటీ వల్ల పశ్చిమ హైదరాబాద్‌లో కోకాపేట్ భూములకు డిమాండ్ కొనసాగుతూనే ఉందని అధికారులు భావిస్తున్నారు.
