అమరావతి అసైన్డ్ భూముల కేసు రద్దు
ఏపీ సీఎం చంద్రబాబుకు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్
హైకోర్టు తీర్పును సమర్థిస్తూ పిటిషన్ కొట్టివేసిన అత్యున్నత న్యాయస్థానం
మంత్రి నారాయణకు కూడా లభించిన ఉపశమనం
మినిట్ 2 మినిట్, అమరావతి(ఆగస్ట్ 15): రాజధాని అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. ఈ కేసులో ఆయనతో పాటు మంత్రి నారాయణపై నమోదైన కేసును రద్దు చేస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది.
2014-19 మధ్యకాలంలో చంద్రబాబు సీఎం హోదాలో ఉన్న సమయంలో అమరావతి రాజధాని నిర్మాణం కోసం ల్యాండ్ పూలింగ్ విధానంలో అసైన్డ్ భూములను సేకరించారు. అయితే ఈ సేకరణ ప్రక్రియలో అక్రమాలు చోటుచేసుకున్నాయని, జీవో ఎంఎస్ నెం.41 ద్వారా కొందరికి అనుచిత లబ్ధి చేకూర్చారని ఆరోపిస్తూ నాటి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో చంద్రబాబు, నారాయణలపై పలు సెక్షన్ల కింద అభియోగాలు మోపారు.
సదరు కేసుపై గతంలో విచారణ జరిపిన హైకోర్టు… ఆరోపణలకు తగిన సరైన ఆధారాలు లేవని స్పష్టం చేస్తూ కేసును కొట్టివేసింది. అయితే హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పును సవాల్ చేస్తూ పిటిషనర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. శుక్రవారం ఈ పిటిషన్‌పై సమగ్ర విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం… హైకోర్టు ఇచ్చిన తీర్పునే సమర్థిస్తూ, కేసును పూర్తిగా కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
