Food Safety: హైదరాబాద్ నగరంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు నిత్యం తనిఖీలు నిర్వహిస్తూ కల్తీ రాయుళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే వ్యాపారుల కంటిమీద కునుకు లేకుండా చేస్తూ అకస్మాత్తుగా దాడులు జరుపుతున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ ఫుడ్ సేఫ్టీ విభాగం (టీజీసేఫ్) అధికారులు హయత్‌నగర్ ప్రాంతంలోని పలు డెయిరీ యూనిట్లపై ఆకస్మిక దాడులు నిర్వహించగా దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
అత్యంత అపరిశుభ్ర వాతావరణంలో, ఎఫ్ఎస్ఎస్ఏఐ (FSSAI) లైసెన్స్ కూడా లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఒక డెయిరీ కేంద్రాన్ని అధికారులు గుర్తించారు. సదరు ప్రాంగణంలో కనీస పరిశుభ్రతా ప్రమాణాలు పాటించకపోవడంతో వెంటనే ఆ డెయిరీ యూనిట్‌ను సీజ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. హయత్‌నగర్ వ్యాప్తంగా ఉన్న ప్రధాన పాల విక్రయశాలలు, సరఫరా కేంద్రాల నుంచి పాల శాంపిళ్లను సేకరించారు. ఈ నమూనాలను నిబంధనల ప్రకారం ల్యాబ్‌కు పంపిస్తున్నట్లు వెల్లడించారు.
నగరంలో ఆహార నాణ్యతా ప్రమాణాలు దెబ్బతింటే ఉపేక్షించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. హోటళ్లు, రెస్టారెంట్లతో పాటు నిత్యం ప్రజలు వినియోగించే పాలు, డైరీ ఉత్పత్తులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. పాడి ఉత్పత్తుల తయారీదారులు, డిస్ట్రిబ్యూటర్లు, విక్రేతలు తప్పనిసరిగా ఆహార భద్రతా ప్రమాణాలు పాటించాలని, లేకపోతే భారీ జరిమానాలతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
వినియోగదారులు కూడా కొనుగోలు చేసే ఉత్పత్తుల నాణ్యత, ఎక్స్ పైరీ తేదీలను పరిశీలించాలని సూచించారు. కల్తీ పాలు లేదా ఆహార పదార్థాల విక్రయాలపై ఫిర్యాదులు వస్తే తక్షణమే చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ బృందం వెల్లడించింది. రాబోయే రోజుల్లో నగరవ్యాప్తంగా తనిఖీలను మరింత విస్తృతం చేయనున్నట్లు స్పష్టం చేశారు.
