online betting: సోషల్ మీడియా తెరలపై విలాసవంతమైన లగ్జరీ కార్లు, కట్టల కొద్దీ నోట్ల బండిళ్లను ప్రదర్శిస్తూ “మేం గెలిచాం.. కోటీశ్వరులమయ్యాం” అంటూ అట్టహాసంగా ప్రచారాలు నిర్వహించే బెట్టింగ్ రాయుళ్ల అసలు రంగు బయటపడుతోంది. వారు చూపే ఆ నకిలీ వెలుగుల వెనుక పదుల సంఖ్యలో కుటుంబాల కన్నీళ్లు, కంటికి రెప్పలా పెంచిన తల్లిదండ్రుల కష్టార్జితం, కట్టుకున్న భార్యల తాళిబొట్లు దాగి ఉన్నాయి. ఒకడు అనుభవిస్తున్న విలాసవంతమైన కారు చక్రాల కింద ఎందరో అమాయక యువకుల భవిష్యత్తు నలిగిపోతోంది.
ఆన్లైన్ బెట్టింగ్ మాయలో పడి నూరేళ్ల జీవితాలను నాశనం చేసుకుంటున్న దారుణ ఉదాహరణలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇంజనీరింగ్ చదువుతున్న వంశీ (21) అనే యువకుడు సరదాగా బెట్టింగ్ యాప్‌లోకి దిగి మొదట్లో రెండు వేల రూపాయలు గెలవడంతో దాన్నే ప్రధాన ఆదాయంగా భావించాడు. ఆపై వరుసగా ఓడిపోతూ, అప్పులు తీర్చడానికి ఇంట్లో అమ్మకు తెలియకుండా బంగారం గాజులు అమ్మాడు. చివరికి రూ. 8 లక్షల అప్పు పేరుకుపోవడంతో చదువు మధ్యలోనే ఆపేసి ఎవరికీ ముఖం చూపించలేక కనిపించకుండా పోయాడు.
మరో ఘటనలో మహేష్ (26) అనే ప్రైవేట్ ఉద్యోగి బెట్టింగ్ ప్రచారకర్తల హంగులు చూసి ఆకర్షితుడయ్యాడు. క్రెడిట్ కార్డులు, ఆన్లైన్ లోన్ యాప్‌ల ద్వారా ఏకంగా రూ. 15 లక్షల వరకు అప్పులు చేశాడు. వాటిని తీర్చే దారి లేక, వేధింపులు తట్టుకోలేక డెత్ నోట్ రాసి ఇంట్లోంచి పారిపోయాడు. నేడు ఆ తల్లిదండ్రులు కొడుకు కోసం, అప్పుల వారి నిందల మధ్య రోడ్డున పడి అల్లాడుతున్నారు.
బెట్టింగ్ యాప్‌లు పూర్తిగా ప్రజల అత్యాశను ఆసరాగా చేసుకుని దోచుకోవడానికే డిజైన్ చేయబడ్డాయి. ఒకడు రూ. 5 కోట్లు గెలిచాడని ప్రచారం చేస్తున్నారంటే, అక్కడ కనీసం 500 మంది తమ జీవితకాల సంపాదనను తగలేశారని అర్థం. సోషల్ మీడియాలో పోజులిచ్చే బెట్టింగ్ కేటుగాళ్లారా.. మీ విలాసాలు సమాజానికి స్ఫూర్తి కావు, అసహ్యకరమైన నేరాలు! ఈ రంగుల లోకాన్ని చూసి మోసపోకుండా, కష్టార్జితాన్ని, కంటికి రెప్పలా చూసుకునే కుటుంబాన్ని బెట్టింగ్ మహమ్మారికి బలి ఇవ్వవద్దని ప్రజలను హెచ్చరిస్తున్నాం.
