హరీశ్‌రావుకు సీఎం రేవంత్ ఘాటు కౌంటర్.. “మొన్న షర్ట్ ఇప్పించాం, ఈసారి నిక్కర్ విప్పిస్తాం!”

Revanth Reddy

Revanth Reddy

Revanth Reddy: సాగునీటి అంశంపై అసెంబ్లీలో చర్చ పెడితే బట్టలు విప్పుతానంటూ మాజీ మంత్రి హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఘాటుగా బదులిచ్చారు. ఆదివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో నిర్వహించిన కాంగ్రెస్ కార్యవర్గ సమావేశంలో సీఎం పాల్గొని ప్రసంగించారు. మొన్న అసెంబ్లీ గేటు ముందు బీఆర్ఎస్ నేతల షర్ట్ మాత్రమే ఇప్పించానని, ఈసారి హరీశ్‌రావు నిక్కర్ సైతం విప్పిస్తానని రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. గతంలో గజ్వేల్‌లో దళిత, గిరిజన దండోరా పెట్టి కేసీఆర్‌ను ఫామ్‌హౌస్‌కు పంపించామని, ఇప్పుడు సిరిసిల్ల, సిద్దిపేటకు వస్తామని, అక్కడా సత్తా చాటుతామని స్పష్టం చేశారు.

పనితీరు ఆధారంగానే టికెట్లు

సమావేశంలో భాగంగా పార్టీ నేతలకు సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. పార్టీ లైన్‌లో ఉండి కష్టపడి పనిచేస్తే పదవి తనంతట తానే ఇంటికి వస్తుందని తెలిపారు. ఢిల్లీలో పరిచయాలున్నా, గాంధీభవన్ చుట్టూ తిరిగినా టికెట్లు రావని తేల్చిచెప్పారు. నాయకులందరి ప్రోగ్రెస్ కార్డు తమ వద్ద ఉందని, పనితీరు ఆధారంగానే వచ్చే ఎన్నికల్లో సీట్లు కేటాయిస్తామని చెప్పారు. ముందు ఏం మాట్లాడుతున్నారో, వెనుక ఏం మాట్లాడుతున్నారో అన్నీ తనకు తెలుసని, పార్టీని చెడగొట్టే వారిని గుర్తిస్తామని వార్నింగ్ ఇచ్చారు.

రెండోసారీ మనదే అధికారం

రాజకీయాల్లో విశ్వాసం వెయ్యి ఏనుగుల బలాన్ని ఇస్తుందని, నాయకులంతా రాహుల్ గాంధీ నాయకత్వంపై నమ్మకం ఉంచాలని సీఎం సూచించారు. ఎన్నికలకు ముందు నమ్మకంతో పార్టీలోకి వచ్చిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇప్పుడు మంత్రి అయ్యారని గుర్తు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రెండోసారి అధికారంలోకి రావడం ఖాయమని, కార్యకర్తలంతా సమన్వయంతో పనిచేస్తే వ్యూహాలను తాము చూసుకుంటామని భరోసా ఇచ్చారు. ఏఐసీసీ కొత్త ఇన్‌చార్జ్ ఎంబీ సందీప్ అన్ని స్థాయిల్లో పనిచేసిన అనుభవజ్ఞుడని సీఎం కొనియాడారు.