Vehicle Insurance: వాహనదారులకు ఇన్సూరెన్స్ విషయంలో త్వరలోనే పెద్ద ఊరట లభించనుంది. ఇప్పటివరకు కారు లేదా బైక్ ఇన్సూరెన్స్ తీసుకుంటే అన్నీ ఒకే ప్యాకేజీలో కలిసి ఉండటంతో, దేనికి ఎంత ప్రీమియం కడుతున్నామో స్పష్టంగా తెలిసేది కాదు. కానీ, ఇకపై ఆ పరిస్థితి మారనుంది. వాహన యజమానులు తమ అవసరానికి తగిన కవరేజీని మాత్రమే ఎంచుకునేలా భారత బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (IRDAI) కీలక మార్పు తీసుకొస్తోంది. డిసెంబర్ 15 నుంచి నాలుగు రకాల కవరేజీలు అమల్లోకి రానున్నాయి.
నాలుగు కవరేజీల వివరాలు ఇవే:
థర్డ్ పార్టీ లయబిలిటీ (తప్పనిసరి): చట్టప్రకారం ఇది తప్పనిసరి. ప్రమాదంలో ఇతరుల ప్రాణ, ఆస్తి నష్టాలకు ఇది పరిహారం అందిస్తుంది. అయితే, మన వాహనానికి లేదా అందులో ప్రయాణించే వారికి రక్షణ ఇవ్వదు.
ప్రయాణికుల బీమా (ఆప్షనల్): వాహనంలోని ప్రయాణికులు, బైక్ వెనుక కూర్చునేవారు (పిలియన్ రైడర్), ఉద్యోగులకు ఇది వర్తిస్తుంది. ఇందులో వాహన యజమానితో పాటు తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి, పిల్లలు మినహా మిగతా వారికి బీమా ఆప్షనల్‌గా ఉంటుంది.
పర్సనల్ యాక్సిడెంట్ కవర్: ఇందులో వాహన యజమానికి రక్షణ తప్పనిసరి కాగా, కారులోని ఇతర ప్రయాణికులు, బైక్ వెనుక కూర్చునేవారు, ఇతర డ్రైవర్లకు కవరేజీ ఆప్షనల్. కుటుంబ సభ్యులకు ప్రమాదవశాత్తు మరణం లేదా శాశ్వత వైకల్యం సంభవిస్తే ఆర్థిక పరిహారం కావాలనుకునే వారు ఈ ఆప్షనల్ కవర్‌ను ఎంచుకోవాలి.
ఓన్-డ్యామేజ్ కవరేజీ (ఆప్షనల్): ఇది కూడా ఆప్షనల్‌గానే ఉంటుంది. ప్రమాదాల్లో మన వాహనానికి జరిగే రిపేర్లు లేదా పూర్తి నష్టాన్ని వాహన విలువ ఆధారంగా భర్తీ చేస్తుంది.
పాత పాలసీ రద్దు చేయకుండానే..
ఇప్పటికే థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ ఉన్నవారు తమ పాత పాలసీని రద్దు చేసుకోవాల్సిన అవసరం లేదు. మధ్యలో అదనపు ప్రీమియం చెల్లించి ప్రయాణికులు లేదా వెనుక కూర్చునేవారికి లీగల్ లయబిలిటీ కవర్‌ను యాడ్ చేసుకునే వెసులుబాటును ఐఆర్డీఏఐ కల్పించింది. డిసెంబర్ 15 లోపు ఈ కొత్త విధానాన్ని ‘బీమా సుగమ్’ ప్లాట్‌ఫామ్‌తో లింక్ చేయాలని బీమా సంస్థలను ఆదేశించింది.
