కైలాస వేదికపై కార్తీక కాంతుల విందు.. కన్నుల పండువగా కోటి దీపోత్సవం!

Koti Deepotsavam

Koti Deepotsavam

Koti Deepotsavam: కార్తీక మాస శోభతో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్న కార్తీకమాసోత్సవాల్లో భాగంగా శుక్రవారం (20.11.2026) దేవస్థానం ఆధ్వర్యంలో ‘కోటి దీపోత్సవం’ అత్యంత వైభవంగా జరిగింది. ఆగమ పాఠశాల ఎదురుగా ఉన్న విశాల మైదానంలో, సాయంత్రం 4.30 గంటల నుంచే భక్తుల సందడి మొదలైంది. ఈ వేడుక కోసం ప్రత్యేకంగా తీర్చిదిద్దిన కైలాస పర్వత నమూనా వేదిక భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. వేలాది మంది భక్తులు భక్తిశ్రద్ధలతో దీపాలను వెలిగించడంతో ఆ ప్రాంగణమంతా దేదీప్యమానంగా, అచ్చం భువిపైకి దిగివచ్చిన కైలాసంలా కాంతులీనింది.

ప్రవచనాల జల్లు.. దశవిధ హారతుల కనువిందు

ఈ మహా క్రతువులో భాగంగా తొలుత ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త డాక్టర్ దీవి హయాగ్రీవాచార్యులు తన అనుగ్రహ భాషణంతో భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తారు. కార్తీక మాసంలో దీపారాధన వల్ల కలిగే పుణ్యఫలాలను, కోటి దీపోత్సవ విశిష్టతను ఆయన కళ్లకు కట్టినట్లు వివరించారు. అనంతరం రాత్రి 7.00 గంటలకు కైలాస వేదికపై కొలువుదీరిన శ్రీస్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు అర్చక స్వాములు శాస్త్రోక్తంగా విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సమర్పించిన దశవిధ హారతులు కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఓంకార, నాగ, త్రిశూల, నంది, సింహ, సూర్య, చంద్ర, కుంభ, నక్షత్ర, కర్పూర హారతుల వెలుగుల్లో స్వామిఅమ్మవార్లను దర్శించుకున్న భక్తులు పరవశించిపోయారు. పూజల అనంతరం వేదపండితుల మంత్రపుష్పం, నీరాజనం సమర్పించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

మనో స్వరార్చన.. భక్తి గీతాల రసఝరి

దీపాల వెలుగులకు తోడుగా సాగిన సంగీత విభావరి భక్తులకు మరపురాని అనుభూతిని మిగిల్చింది. ప్రముఖ సినీ నేపథ్య గాయకులు మనో తన బృందంతో కలిసి నిర్వహించిన భక్తి సంగీత స్వరార్చన కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది. ‘వాతాపి గణపతిం భజే’ అంటూ గణనాథుడి స్తుతితో కచేరీని ప్రారంభించిన ఆయన.. ఆ తర్వాత ‘ఓంకార నాదాను’, ‘జయ జయ మహాదేవ నీల కంధర’, ‘మహాప్రాణ దీపం’ వంటి అద్భుతమైన సినీ భక్తి గీతాలను ఆలపించి శ్రోతలను మంత్రముగ్ధులను చేశారు. వీటితో పాటు శివ అష్టకాలు, స్తోత్రాలను తనదైన గాత్రంతో ఆలపిస్తూ ప్రాంగణమంతా శివనామస్మరణతో మారుమోగేలా చేశారు.

సమన్వయంతో సాగిన మహా వేడుక

ఈ ఆధ్యాత్మిక మహోత్సవాన్ని అత్యంత కట్టుదిట్టంగా, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వహించామని ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పోతుగుంట రమేష్‌నాయుడు, కార్యనిర్వహణాధికారి శ్రీ యం. శ్రీనివాసరావు తెలిపారు. వేలాదిగా తరలివచ్చిన భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు, వివిధ విభాగాల అధికారులు, ఆలయ అర్చక స్వాములు, వేదపండితులు మరియు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామిఅమ్మవార్ల కృపకు పాత్రులయ్యారు.