ఏడాది ఆగండి.. నా పని నచ్చితేనే లైక్ కొట్టండి.. విమర్శకులకు విజయసాయిరెడ్డి సవాల్!

Vijayasai Reddy

Vijayasai Reddy

Vijayasai Reddy:  రాజకీయాల్లో తమ వయసు, ప్రస్థానంపై సోషల్ మీడియా వేదికగా వస్తున్న విమర్శలు, సందేహాలకు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి అత్యంత పరిణతితో, ఆసక్తికరంగా సమాధానమిచ్చారు. ఇటీవల ఆయన స్థాపించిన కొత్త పార్టీ (పీఆర్‌పీ) నేపథ్యంలో, ఆయన మనవరాలితో సాగిన ఒక సంభాషణ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. జనంలో నమ్మకం సంపాదించుకోవడం ఎంత ముఖ్యమో ఈ సందర్భంగా ఆయన స్పష్టంగా వివరించారు.

‘వాళ్ల సందేహం కూడా న్యాయమైనదే’

సోషల్ మీడియా కామెంట్లలో చాలామంది “తాతా.. ఈ వయసులో రాజకీయాలు ఎందుకు? విశ్రాంతి తీసుకోవచ్చు కదా” అని అడుగుతున్నారని, వారికి ఏమని సమాధానం చెప్పాలని ఆయన మనవరాలు ప్రశ్నించారు. దీనికి విజయసాయిరెడ్డి స్పందిస్తూ.. “ఇప్పుడే వాళ్లకు రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదమ్మా. వాళ్ల సందేహం కూడా చాలా న్యాయమైనదే (ఫెయిర్). ఎందుకంటే వయసుకు గౌరవం ఆటోమేటిక్‌గా రావచ్చు కానీ, జనంలో నమ్మకం (ట్రస్ట్) మాత్రం ఆటోమేటిక్‌గా రాదు కదా” అని వ్యాఖ్యానించారు.

పనితీరు ఆధారంగానే అంచనా వేయండి:

తమ లక్ష్యం గురించి వివరిస్తూ.. “నాకు ఇప్పుడు కొత్తగా కెరీర్ నిర్మించుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ఏ పదవినో కాపాడుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. నేను చెప్పే విషయాలు సమాజానికి ఉపయోగపడుతున్నాయా, చెప్పిన పని జరుగుతుందా అనే దాని ఆధారంగానే నన్ను అంచనా వేయమని చెప్పు” అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. చివరగా నెటిజన్లకు ఏమని బదులివ్వాలని మనవరాలు అడగగా.. “ఒక్క ఏడాది పాటు వేచి చూడండి. నేను చేసే పని మీకు కనిపించి, నచ్చితే నాకు లైక్ కొట్టండి. ఒకవేళ నా పని కనిపించకపోయినా, నచ్చకపోయినా ఆ విమర్శనాత్మక కామెంట్లు పెట్టిన వాళ్లకే లైక్ కొట్టండి అని చెప్పు” అంటూ విజయసాయిరెడ్డి ముగించారు. రాజకీయాల్లో పదవుల కంటే ప్రజల నమ్మకం, పనితీరే ముఖ్యమని ఆయన చెప్పిన తీరు చర్చనీయాంశంగా మారింది.