ANAKAPALLI: ఉత్తరాంధ్రలోనే అరుదైన ఏకశిలా ‘పతునెట్టంపాడి’ అయ్యప్ప క్షేత్రం!

ఉత్తరాంధ్రలోనే అరుదైన
ఏకశిలా ‘పతునెట్టంపాడి’ అయ్యప్ప క్షేత్రం!

రూ. 50 లక్షల విలువైన 11 సెంట్ల భూమిని
విరాళం ఇచ్చిన పినపాత్రుని కుటుంబం!

ఊరంతా ఏకమై రూ. 2 కోట్లతో నిర్మించిన భక్తి ధామం!

శబరిమలను తలపిస్తున్న ఎస్. రాయవరం శబరిగిరీశుని సన్నిధానం!

మినిట్ 2 మినిట్, ఎస్. రాయవరం(ఆగస్ట్ 19): అనకాపల్లి జిల్లా ఆధ్యాత్మిక వైభవానికి ప్రతిరూపం. ప్రతి గ్రామంలోనూ దైవచింతన, ప్రతి గుండెలోనూ భక్తిపారవశ్యం నిండివుంటాయి. అందునా మహాకవి గురజాడ అప్పారావు జన్మస్థలమైన, పవిత్ర వరహా నది ఒడ్డున విలసిల్లే ఎస్. రాయవరం (సర్వసిద్ధి రాయవరం) మండలానికి ఆధ్యాత్మిక చరిత్రలో ప్రత్యేక స్థానముంది. పచ్చని పంట పొలాల మధ్య కొలువైన ఈ దివ్య క్షేత్రంలో.. ఇప్పుడు మరొక అరుదైన ఆధ్యాత్మిక అద్భుతం సాకారమైంది. గ్రామస్తుల సమైక్యతకు, శ్రీ హరిహరపుత్రునిపై ఉన్న అపారమైన భక్తిశ్రద్ధలకు నిదర్శనంగా రూపుదిద్దుకున్న “శ్రీ పూర్ణా పుష్కలాంబ సమేత శ్రీ అయ్యప్పస్వామి వారి ఆలయం” నేడు యావత్ ఉత్తరాంధ్రకే తలమానికంగా నిలిచింది.

11 సెంట్ల భూమి విరాళం.. గ్రామస్తుల మహా సంకల్పం

ఊరిలో స్వామివారికి దివ్యాలయం నిర్మించాలనే ప్రతిపాదన రాగానే, పినపాత్రుని వారి కుటుంబ సభ్యులు (నలుగురు అన్నదమ్ములు) అత్యంత ఉదారతతో ముందుకు వచ్చారు. సుమారు రూ. 50 లక్షల మార్కెట్ విలువ కలిగిన తమ 11 సెంట్ల (532 చదరపు గజాల) స్థలాన్ని ఆలయానికి ఉచితంగా అందజేశారు. వారి దాతృత్వం ఇచ్చిన స్ఫూర్తితో ఊరంతా ఒక్కటైంది. రాజకీయ విభేదాలకూ తావులేకుండా కేవలం ప్రజా సంకల్పంతో, భక్తులు, వ్యాపారుల విరాళాలతో దాదాపు రూ. 2 కోట్ల అంచనా వ్యయంతో ఈ ఆలయ నిర్మాణాన్ని దిగ్విజయంగా పూర్తిచేశారు.

ఉత్తరాంధ్రలోనే ప్రథమ ఏకశిలా ‘18 మెట్లు’ (పతునెట్టంపాడి)

ఈ ఆలయానికి ఉన్న అతిపెద్ద ప్రత్యేకత.. ఉత్తరాంధ్రలోనే ప్రథమంగా అత్యంత పవిత్రమైన ఏకశిల రాయిపై 18 మెట్లను (పతునెట్టంపాడి) మలచడం! శబరిమలను తలపించేలా తమిళనాడులోని కుంభకోణం నుంచి ప్రత్యేకంగా చేయించిన మూలవిరాట్‌ను ఇక్కడ ప్రతిష్టించారు. ఆల నిర్మాణ సమయంలోనే సుమారు 80 మందికి పైగా భక్తులు ప్రత్యేకంగా అయ్యప్ప దీక్షలు స్వీకరించి తమ శ్రమదానంతో ఆలయ నిర్మాణంలో భాగస్వాములయ్యారు. బొలిశెట్టి గోవిందరావు, కొణతాల శ్రీను, సోమిరెడ్డి రాజు, యడ్ల వరహాలరావు తదితర గ్రామ పెద్దలతో పాటు ఆలయ కమిటీలోని దాడిశెట్టి సురేశ్, పులి సత్తిబాబు, ఇతర సభ్యుల నిరంతర పర్యవేక్షణలో పనులు పూర్తయ్యాయి.

ఆగమోక్తంగా, వైభవంగా ప్రతిష్ఠా మహోత్సవాలు

2026 ఏప్రిల్ 26 (ఆదివారం) వృషభ లగ్నాన స్వామివారి ప్రతిష్ఠాపన అత్యంత వైభవంగా జరిగింది. స్వామివారితో పాటు శ్రీ కన్నెమూల గణపతి, శ్రీ సుబ్రహ్మణ్యస్వామి, శ్రీ కరుప్పుస్వామి, శ్రీ కడుత్తస్వామి, మాలికాపురత్తమ్మ విగ్రహాలు, ధ్వజస్తంభం మరియు పసిడికలశ ప్రతిష్ఠాపనలు జరిగాయి. సహస్రాధిక దేవాలయ ప్రతిష్ఠాపకులు, హనుమాన్ ఉపాసకులు శ్రీమాన్ రేజేటి శ్రీరామాచార్యుల సంపూర్ణ పర్యవేక్షణలో, వారి కుమారులు శ్రీమాన్ రేజేటి సీతారామాచార్యులు (కన్నబాబు), శ్రీమాన్ రేజేటి శ్రీరామ చరణాచార్యులతో పాటు కేరళ నుంచి విచ్చేసిన ప్రత్యేక నంబూద్రీల వేదపారాయణలు, ఆగమోక్త హోమాల మధ్య ఈ మహోత్సవం నిర్వహించబడింది.

నిత్య పూజలు, దివ్య నామస్మరణలు, అన్నదానాలతో అలరారుతున్న ఈ ఎస్. రాయవరం అయ్యప్ప ఆలయం, శబరిమల వెళ్లలేని వేలాది మంది భక్తులకు శబరిగిరీశుని ప్రత్యక్ష దర్శన ప్రాప్తిని కలిగిస్తూ ఉత్తరాంధ్రలోనే దివ్యమైన ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది.