మేం సీఎం గారి తాలూకా!
ఎక్కడికి వెళ్లినా ఇదే పంచాయతీ
కేసుల నుంచి తప్పించుకునేందుకు..
రేవంత్ రెడ్డి మా బంధువు, మా స్నేహితుడు అంటూ గప్పాలు
అధికారులకు, సిబ్బందికి తప్పని తిప్పలు
సీఎం పీఠంపై రేవంత్ రెడ్డి కూర్చున్నప్పటి నుంచి ఇదే తంతు
మినిట్ 2 మినిట్, పొలిటికల్ డెస్క్: “మేం సీఎం గారి తాలూకా! మా జోలికొస్తే ఊరుకునేది లేదు!” — ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చిన్న తనిఖీ జరిగినా, రోడ్డు ప్రమాదం జరిగినా అధికారులకు తరచూ వినపడుతున్న హెచ్చరిక ఇది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయన పేరును, ప్రతిష్టను కేడర్ నుంచి సామాన్య నేరస్తుల వరకు స్వార్థానికి వాడుకోవడం ఒక పరిపాటిగా మారింది. చట్టం నుంచి తప్పించుకోవడానికి, తనిఖీలకు వచ్చే అధికారులను బెదిరించడానికి సీఎం పేరును అక్రమార్కులు రక్షణ కవచంలా వాడుకుంటూ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేస్తున్నారు.
సివిల్ తగాదాల నుంచి క్రిమినల్ కేసుల వరకు ప్రతీ చోటా సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఆయన సోదరులు తిరుపతి రెడ్డి, కొండల్ రెడ్డి పేర్లు విపరీతంగా దుర్వినియోగం అవుతున్నాయి. ఇటీవల రంగారెడ్డి జిల్లాలో చైల్డ్ లేబర్ కేసులో ఓ యజమానిపై అధికారులు చర్యలకు సిద్ధమవ్వగా, అతడు వెంటనే సీఎంతో ఉన్న పాత ఫోటోలు చూపిస్తూ “మేము సీఎం సొంతూరు వాళ్లం, చిన్నప్పటి నుంచి కలిసి తిరిగాం” అని బెదిరింపులకు దిగాడు. దీంతో అధికారులు తీవ్ర ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నారు.
ఈ తరహా ఆగడాలు రోజురోజుకూ మితిమీరిపోతుండటంతో క్షేత్రస్థాయిలో పనిచేసే పోలీసులకు, ప్రభుత్వ సిబ్బందికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నిజమైన బాధితులకు న్యాయం చేయలేక, ఇటు సీఎం పేరు చెప్పే అక్రమార్కులపై చర్యలు తీసుకోలేక అధికారులు సతమతమవుతున్నారు. అయితే, ఇలాంటి బెదిరింపులకు వెనకడుగు వేయకుండా కొందరు అధికారులు ధైర్యంగా చట్టప్రకారం ముందడుగు వేస్తుండడం గమనార్హం.
ఈ అక్రమాల విషయం ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లి ఉండొచ్చు. కానీ, ఇప్పుడిది మరింత మితిమీరింది. కొందరి స్వార్థం వల్ల ప్రభుత్వంపై ప్రజల్లో చులకన భావం ఏర్పడే ప్రమాదం ఉంది. తన పేరును, సోదరుల పేర్లను దుర్వినియోగం చేస్తున్న వారిపై సీఎం రేవంత్ రెడ్డి కఠినంగా స్పందించి, తక్షణమే అడ్డుకట్ట వేయకపోతే, ఇది ఆయన రాజకీయ ప్రతిష్టకే మాయని మచ్చగా మారే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
