దేవుళ్ల మధ్య కూడా విభేదాలు సృష్టిస్తున్నారు.. కాంగ్రెస్, బీజేపీలపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం

BRS Politics

BRS Politics

BRS Politics: తెలంగాణ రాష్ట్రావిర్భావానికి, వికాసానికి పునాదిగా నిలిచిన తెలంగాణ రాష్ట్రీయ సమితి (టీఆర్ఎస్) పేరును భారత్ రాష్ట్రీయ సమితి (బీఆర్ఎస్)గా మార్చడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర, సంచలన వ్యాఖ్యలు చేశారు. పేరు మారినంత మాత్రాన పార్టీ సిద్ధాంతం, ఆలోచనా విధానం, నాయకత్వం, ప్రజల పట్ల ఉన్న అంకితభావం ఏమాత్రం మారవని ఆయన స్పష్టం చేశారు. “నేను షారుఖ్ ఖాన్ అని పేరు పెట్టుకున్నంత మాత్రాన షారుఖ్ ఖాన్ అయిపోతానా?” అని ఉదాహరిస్తూ, తెలుగు సినిమాలు పాన్-ఇండియా స్థాయికి వెళ్లి సంచలన విజయాలు సాధిస్తున్నప్పుడు, తెలుగు నేల వేదికగా పుట్టిన రాజకీయ పార్టీ జాతీయ స్థాయికి ఎందుకు విస్తరించకూడదని ప్రశ్నించారు.

తెలంగాణలో కేసీఆర్ నాయకత్వంలో సాధించిన సంక్షేమం, అభివృద్ధి మోడల్‌ను దేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించి నిలదొక్కుకోవాలనే దూరదృష్టితోనే జాతీయ రాజకీయంలోకి అడుగుపెట్టామని కేటీఆర్ పునరుద్ఘాటించారు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల వైఖరిపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మత ప్రాతిపదికన దేశాన్ని విభజించేందుకు బీజేపీ కుట్రలు చేస్తుంటే, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకంగా ప్రజలు ఆరాధించే రాముడు, శివుడి మధ్య ప్రాంతీయ విభేదాలు సృష్టించేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. ఈ రెండు పార్టీల అసలు రంగును ప్రజలు గమనిస్తున్నారని దుయ్యబట్టారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై ప్రజలు ఇప్పటికే తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, మరో రెండేళ్లు ఆగితే కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, రానున్న రోజుల్లో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోతాయని పేర్కొన్నారు. అలాగే ఎన్నికల సంఘం విశ్వసనీయతపై దేశవ్యాప్తంగా వ్యక్తమవుతున్న సందేహాలపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.