కర్ణాటక మైన్స్ అండ్ జియాలజీ శాఖతో ఒప్పందం
సంస్థ చరిత్రలోనే ఇదే తొలిసారి
మినిట్ 2 మినిట్, కొత్తగూడెం (ఆగస్ట్ 08): కర్ణాటక రాష్ట్రంలోని దేవదుర్గ బ్లాక్లో బంగారం, రాగి ఖనిజాల అన్వేషణ దిశగా సింగరేణి సంస్థ కీలక ముందడుగు వేసింది. ఖనిజ అన్వేషణ పనులు ప్రారంభించేందుకు కర్ణాటక మైన్స్ అండ్ జియాలజీ శాఖతో సింగరేణి సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. బెంగళూరులో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కర్ణాటక మైన్స్ అండ్ జియాలజీ శాఖ డైరెక్టర్ రంగప్ప, సింగరేణి డైరెక్టర్ (ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్) కే. వెంకటేశ్వర్లు అధికారిక ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.
ఈ ఒప్పందం ప్రకారం రాయచూర్, యాదగిరి జిల్లాల్లోని దేవదుర్గ ప్రాంతంలో 199.13 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఐదేళ్ల వ్యవధిలో అన్వేషణ పనులను పూర్తి చేయనున్నారు. సింగరేణి సంస్థ ఇప్పటికే ఇందుకు సంబంధించిన అన్వేషణ లైసెన్స్ పొందిందని అధికారులు స్పష్టం చేశారు. త్వరలోనే పూర్తి స్థాయిలో పనులు ప్రారంభించి రెండేళ్లలోపు ‘జీ-4’ దశ అన్వేషణ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెంకటేశ్వర్లు వెల్లడించారు.
ఇతర రాష్ట్రాల్లో ఈ స్థాయిలో ఖనిజ అన్వేషణ చేపట్టడం సింగరేణి చరిత్రలోనే తొలిసారి కావడం విశేషం. బొగ్గు ఉత్పత్తిలోనే కాకుండా ఇతర ఖనిజ రంగాలోకి అడుగుపెడుతూ సింగరేణి సాధిస్తున్న ఈ పురోగతిపై హర్షం వ్యక్తమవుతోంది.
