Haribabu Murder: నిజామాబాద్ నగరంలో నడిరోడ్డుపై జరిగిన హరిబాబు హత్య కేసు ఊహించని మలుపు తిరిగింది. యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబును తానే నరికి చంపినట్లు ఆమె సోదరుడు సంతోష్ స్వయంగా ఓ వీడియోను విడుదల చేయడం తీవ్ర కలకలం రేపింది. చెల్లిని గర్భవతి అని కూడా చూడకుండా అన్యాయంగా పొట్టనబెట్టుకున్న హరిబాబుకు సరైన గుణపాఠం చెప్పానని సంతోష్ ఆ వీడియోలో బహిరంగంగా ఒప్పుకున్నాడు. ఏ ఆడబిడ్డకూ తన చెల్లికి జరిగినటువంటి అన్యాయం మళ్లీ జరగకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. ఈ పరిణామంతో నిజామాబాద్ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
తన చెల్లి దారుణ హత్యకు ప్రతీకారంగానే హరిబాబును అంతమొందించినట్లు సంతోష్ స్పష్టం చేశాడు. ఈ హత్యతో తన చెల్లి ఆత్మకు, మరణానికి న్యాయం చేసానని పేర్కొన్నాడు. నేరం చేసిన తర్వాత తప్పించుకుని తిరిగే ఆలోచన లేదని, నేరుగా వెళ్లి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోతున్నానని ఆ వీడియోలో ప్రకటించడం సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో ఆధారంగా పోలీసులు విచారణను వేగవంతం చేశారు.
ఈ కేసులో మరో ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచ్చింది. సరిగ్గా 2025 సెప్టెంబర్ 17న హరిబాబు చేతిలో వైష్ణవి హత్యకు గురికాగా, ఏడాదయ్యే సరికి మళ్లీ అదే రోజున హరిబాబు దారుణంగా హత్యకావడం గమనార్హం. ఏడాది క్రితం జరిగిన ఆ చేదు జ్ఞాపకాన్ని మనసులో ఉంచుకుని సంతోష్ ఈ పక్కా ప్రణాళికతో ప్రతీకార చర్యకు దిగినట్లు తెలుస్తోంది. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఈ ఘటన జరగడం నిజామాబాద్ వాసులను భయాందోళనలకు గురిచేసింది.
హత్య వెనుక ఇంకా ఎవరైనా సహకరించారా లేదా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. సంతోష్ విడుదల చేసిన వీడియో ఆధారాలను స్వాధీనం చేసుకుని, ఆయన లొంగిపోయాక పూర్తి స్థాయి ప్రకటన విడుదల చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. పగ, ప్రతీకారంతో జరిగిన ఈ జంట హత్యల వ్యవహారం రెండు రాష్ట్రాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
