ఆధ్యాత్మికత వర్సెస్ ఆడంబరం.. వినాయక చవితి వేడుకలు ఎటు దారితీస్తున్నాయి?

Ganesh Celebrations

Ganesh Celebrations

Ganesh Celebrations: గల్లీ గల్లీలో గణేశుడి విగ్రహాలు వెలిశాయి. ప్రతి వీధిలోనూ భక్తిభావం ఉట్టిపడుతోంది. చిన్నా పెద్దా తేడా లేకుండా తలో చేయి వేసి పందిళ్లు వేయడం, పూజలు నిర్వహించడం హిందువుల ఐక్యతకు పండుగ తెచ్చిన కొత్త శోభ. 90ల నాటి రోజులను గుర్తుచేసుకుంటే చాలు.. కడుపునిండా పంచిపెట్టే ప్రసాదాలు, పిల్లల అల్లరి, దోసిళ్ల నిండా ప్రసాదాలను స్వీకరించి ఆనందించిన క్షణాలు మనసును మైమరపిస్తాయి. 2000ల తర్వాత ఈ సంస్కృతి నగరంలో మరింత వేగంగా విస్తరించింది. గత ముప్పై ఏళ్లుగా నిరంతరం స్వామివారిని పూజిస్తున్న మండపాలు నేటికీ ఎన్నో ఉన్నాయి.

అయితే ఈ వేడుకల వెనుక ఉన్న అసలు చరిత్రను ఒకసారి గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉంది. బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా ప్రజలను ఏకం చేయడానికి, దేశభక్తి భావనలు నూరిపోసి స్వాతంత్ర్య కాంక్షను రగిలించడానికి మహనీయుడు బాలగంగాధర తిలక్ ఈ గణేశ్ నవరాత్రి ఉత్సవాలను ఒక ఉద్యమంలా తీర్చిదిద్దారు. భక్తి, భజనలు, సమాజ ప్రయోజనాల చుట్టూ నాటి ఉత్సవాలు సాగాయి.

కాలక్రమేణా ఈ పండుగ స్వరూపం మారుతూ రావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. భక్తి స్థానంలో కోట్లాది రూపాయల ఆడంబరం, పేద ధనిక తారతమ్యాలు, కాలనీలు, బస్తీల మధ్య పోటీలు, స్వార్థం, అహంభావం చోటుచేసుకుంటున్నాయి. దేవాలయాల వద్ద వినపడాల్సిన భక్తిపాటల స్థానంలో అసభ్యకరమైన సినిమా పాటలు, శబ్ద కాలుష్యాన్ని పెంచే డీజేలు, మద్యంతో చిందులు వేసే సంస్కృతి పెరిగిపోవడం అత్యంత బాధాకరం.

గణేశుడి ఆరాధన అంటే కేవలం వేడుక మాత్రమే కాదు, అదొక గొప్ప సామాజిక బాధ్యత. పూజలో ఉపయోగించే 21 పత్రుల ప్రాముఖ్యత, పర్యావరణానికి అవి చేసే మేలు తెలుసుకోవడం ఇందులో కీలకం. మట్టి వినాయకుడి ఆరాధన వెనక ప్రకృతి పట్ల ఉండాల్సిన బాధ్యత దాగి ఉంది. అలాగే స్వామివారి పెద్ద చెవులు, బొజ్జ, చిన్న కళ్లు సూచించే జీవిత సత్యాలను గుర్తించడమే అసలైన భక్తి. ఆడంబరాలు, పరస్పర విద్వేషాలు పక్కనపెట్టి మన సంస్కృతి గొప్పతనాన్ని చాటాలి. “గల్లీ గల్లీ మే గణేశ్ బైఠావో మగర్.. దేశ్ కి సంస్కృతి కో బర్బాద్ నహీ కర్నా”. మన ప్రాచీన సంస్కృతికి విఘాతం కలిగించకుండా, పరాయి మతస్తుల ముందు తలదించుకునేలా వ్యవహరించకుండా ఉత్సవాలు నిర్వహించాలి. ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు జరుపుకుని, ఆ పార్వతీతనయుడి దివ్యానుగ్రహం పొందాలని ‘మినిట్ 2 మినిట్’ తరఫున కోరుకుంటున్నాం.