సినిమా చూసి కన్నతండ్రినే కడతేర్చిన కొడుకు.. చిన్న తప్పిదంతో అడ్డంగా దొరికిపోయిన వైనం!

Drishyam murder

Drishyam murder

Drishyam murder: సినిమా ఫాంటసీని చూసి నేరాలకు పాల్పడుతున్న మరో ఘోర ఉదంతం కలకలం రేపింది. ‘దృశ్యం-3’ సినిమా ప్రేరణతో ఆస్తి వివాదాల నేపథ్యంలో కన్నతండ్రినే దారుణంగా హత్య చేసిన కఠినాత్ముడైన కొడుకును బీహార్ పోలీసులు అరెస్టు చేశారు. సమస్తిపూర్ జిల్లాలోని దర్వా గ్రామానికి చెందిన రఘువీర్ సాహ్ని (50) ని ఆయన కుమారుడు శివ్ శంకర్ (26) దారుణంగా అంతమొందించాడు.

పోలీసుల కథనం ప్రకారం.. కొంతకాలంగా తండ్రితో ఉన్న ఆస్తి, కుటుంబ తగదాల కారణంగా సూరత్‌లో ఉంటున్న శివ్ శంకర్ తండ్రిని అంతమొందించేందుకు పక్కా వ్యూహం పన్నాడు. పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు తన మొబైల్ ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేసి రహస్యంగా స్వగ్రామానికి చేరుకున్నాడు. అర్థరాత్రి ఇంట్లోకి చొరబడి నిద్రిస్తున్న తండ్రిని గొడ్డలితో నరికి చంపేసాడు. అనంతరం వేగంగా పాటోరి రైల్వే స్టేషన్‌కు వెళ్లిపోయాడు.

పోలీసులకు దొరకకూడదని ఎన్నో జాగ్రత్తలు తీసుకున్న నిందితుడిని చిన్న పొరపాటే కటకటాల వెనక్కి నెట్టింది. పాటోరి రైల్వే స్టేషన్‌లో ఫోన్ ఆన్ చేసి భార్యకు కాల్ చేయడంతో సిగ్నల్ టవర్ లొకేషన్ పోలీసుల టెక్నికల్ సర్వేలెన్స్‌కు చిక్కింది. సీడీఆర్ (CDR) డేటా ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు సూరత్‌కు వెళ్లి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ‘దృశ్యం’ సినిమా స్ఫూర్తితోనే ఈ ప్లాన్ వేసినట్లు నిందితుడు అంగీకరించడంతో పోలీసులు అతడిని రిమాండ్‌కు తరలించారు.