Srinivasa Rao: భారతీయ చలనచిత్ర రంగానికి మరపురాని సేవలు అందించిన ప్రముఖ ప్రయోగాల దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు అంతిమ యాత్ర ముగిసింది. ఆయన భౌతికకాయానికి చెన్నైలోని నేసపాకం శ్మశానవాటికలో కుటుంబ సభ్యులు, ప్రముఖుల సమక్షంలో అంత్యక్రియలు పూర్తిచేశారు. ఈ సందర్భంగా సినీ లోకం ఆయనకు అశ్రునయనాలతో కన్నీటి వీడ్కోలు పలికింది.
సింగీతం పార్ధివదేహాన్ని కడసారి దర్శించి, తుది నివాళులు అర్పించేందుకు తెలుగు, తమిళ చిత్రసీమలకు చెందిన పలువురు ప్రముఖ నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు పెద్ద ఎత్తున శ్మశానవాటికకు తరలివచ్చారు. చిత్రసీమకు ఆయన అందించిన వినూత్న చిత్రాలు, దశాబ్దాల కాలంగా ఆయన చేసిన విశిష్ట సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకుంటూ పలువురు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.
నటుడిగా, దర్శకుడిగా, సంగీత దర్శకుడిగా బహుముఖ ప్రజ్ఞ చాటిన సింగీతం శ్రీనివాసరావు.. మాటలు లేని ‘పుష్పక విమానం’, సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘ఆదిత్య 369’, జానపద క్లాసిక్ ‘భైరవద్వీపం’ వంటి మైలురాయి చిత్రాలతో సినీ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని లిఖించుకున్నారు. అంతిమ సంస్కారాల అనంతరం శ్మశానవాటిక పరిసరాలు తీవ్ర విచారంలో మునిగిపోయాయి. భారతీయ సినీ రంగం ఒక గొప్ప విజనరీ, దిగ్గజాన్ని కోల్పోయిందని చిత్ర పరిశ్రమ వర్గాలు సంతాపాన్ని ప్రకటించాయి.
