వెలుగుల నగరం.. వేలాది ఉద్యోగాలు.. ‘నైట్ ఎకానమీ’తో మార్పు సాధ్యమేనా?

Night Economy

Night Economy

Night Economy: హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయి మెట్రోపాలిటన్ నగరంగా తీర్చిదిద్దే క్రమంలో ‘24/7 నైట్ ఎకానమీ’ విధానం ఒక విప్లవాత్మకమైన ఆలోచన. 24 గంటలూ వ్యాపారాలు, రెస్టారెంట్లు, ఐటీ, లాజిస్టిక్స్, సేవా రంగాలు నడవటం వల్ల నగర ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకోవడమే కాకుండా వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అయితే, ఒక విధానాన్ని కాగితాలపై తీసుకురావడం ఎంత సులువో, దాన్ని క్షేత్రస్థాయిలో విజయవంతంగా అమలు చేయడం అంతకంటే సంక్లిష్టం. నగర యంత్రాంగం, మౌలిక వసతులు ఈ మార్పునకు ఎంతవరకు సిద్ధంగా ఉన్నాయనే ప్రశ్న ఇప్పుడు విస్తృతమైన చర్చకు దారితీస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా లండన్, ఆమ్‌స్టర్‌డ్యామ్, సింగపూర్ వంటి నగరాలు నైట్ ఎకానమీలో విజయం సాధించడానికి ప్రధాన కారణం రాత్రివేళల కోసమే ప్రత్యేకంగా రూపొందించిన పాలనా వ్యవస్థలు. లండన్‌లో ‘నైట్ ట్యూబ్’ పేరిట అర్ధరాత్రి వేళల్లో కూడా భూగర్భ రైళ్లు, ప్రత్యేక నైట్ బస్సులు నిరంతరం తిరుగుతాయి. రవాణా సదుపాయం సురక్షితంగా ఉన్నప్పుడే సామాన్య పౌరులు, రాత్రి షిఫ్ట్‌లలో పనిచేసే ఉద్యోగులు ధైర్యంగా ఇళ్లకు చేరుకోగలుగుతారు. అంతేకాకుండా, నగరాల్లో రాత్రిపూట శాంతిభద్రతల పరిరక్షణకు, నేరాల నియంత్రణకు పబ్లిక్ సేఫ్టీ వాలంటీర్లు, సీసీటీవీ నిఘా వ్యవస్థలతో కూడిన ప్రత్యేక యంత్రాంగాలు రౌండ్ ది క్లాక్ పనిచేస్తాయి. మన నగరాన్ని పరిశీలిస్తే, అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రజా రవాణా వ్యవస్థ దాదాపు స్తంభించిపోతుంది. మెట్రో సర్వీసులు నిలిచిపోవడం, పరిమిత సంఖ్యలో మాత్రమే రాత్రి బస్సులు ఉండటం వల్ల సాధారణ కార్మికులు, ప్రైవేట్ ఉద్యోగులు ఆటోలు లేదా ట్యాక్సీలపైనే ఆధారపడాల్సి వస్తోంది. మరోవైపు, నైట్ ఎకానమీలో మహిళల భాగస్వామ్యం అత్యంత కీలకం. రాత్రి వేళల్లో పనిచేసే మహిళలకు పనిప్రాంతాల్లో రక్షణ కల్పించడం, ప్రయాణ సమయంలో వేధింపులను అరికట్టేలా మహిళా శిశు సంక్షేమ శాఖ, షీ టీమ్స్ పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. రాత్రిపూట ఆర్థిక కార్యకలాపాలు అంటే కేవలం బార్లు, పబ్‌లకే పరిమితం కాకుండా, అన్ని రకాల వ్యాపారాలకు రక్షణ ఇచ్చే వాతావరణం ఏర్పడాలి.

అంతిమంగా, ఈ విధానం సత్ఫలితాలనివ్వాలంటే శాంతిభద్రతల పోలీసింగ్, ట్రాఫిక్ నియంత్రణ, జీహెచ్‌ఎంసి పారిశుధ్యం, మెట్రో-ఆర్టీసీ రవాణా, ఎక్సైజ్, విద్యుత్, అగ్నిమాపక శాఖలన్నీ విడివిడిగా కాకుండా ఒకే తాటిపైకి వచ్చి పనిచేయాలి. సమగ్రమైన కార్యాచరణ, శాఖల మధ్య పక్కా సమన్వయం సిద్ధం చేసినప్పుడే, హైదరాబాద్ నైట్ ఎకానమీ కల నిజమై నగరానికి అసలైన ఆర్థిక బలం చేకూరుతుంది.

“24/7 నైట్ ఎకానమీ ద్వారా కొత్త ఉపాధి అవకాశాలు రావడం,  ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడం శుభపరిణామమే. కానీ అదే సమయంలో మహిళల భద్రత, నమ్మకమైన ప్రజా రవాణా, మెరుగైన మౌలిక వసతులు ఎంతో అవసరం. GHMC, పోలీస్,  ట్రాఫిక్, HMDA, ఆర్టీసీ, ఎక్సైజ్ వంటి పలు శాఖల మధ్య సమర్థవంతమైన సమన్వయం లేకపోతే ఈ విధానం ఆశించిన ఫలితాలనివ్వదు”.