ఆయుధాల చోరీ.. ఇంటిదొంగ పనే!

Bolarum Theft

Bolarum Theft

Bolarum Theft :బోలారంలోని మద్రాస్ రెజిమెంట్ సెంటర్‌లో చోటుచేసుకున్న ఆయుధాల దొంగతనం కేసును పోలీసులు సత్వరమే ఛేదించారు. ఈ సంచలనాత్మక చోరీకి సంబంధించిన పూర్తి వివరాలను హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. ఈ కేసులో మొత్తం నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు ఉప్పతోళ్ల మల్లేష్, 20 బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్‌లో హవల్దార్‌గా పనిచేసి ముందస్తు రిటైర్మెంట్ తీసుకున్నాడు. త్వరగా పదవీ విరమణ పొందిన తీరుపై ఉన్న ఆగ్రహంతోనే ఈ దొంగతనానికి ఒడిగట్టినట్లు విచారణలో ప్రాథమికంగా తేలింది.

ఆగస్టు 31న బోలారంలోని మద్రాస్ రెజిమెంట్ బెల్ ఆఫ్ ఆర్మ్స్‌లో ఈ భారీ చోరీ జరిగింది. బెల్ ఆఫ్ ఆర్మ్స్ ఇన్‌చార్జ్, అమ్యునేషన్ సెక్షన్ ఇన్‌చార్జ్‌ల సహకారంతోనే మల్లేష్ ఈ ఆయుధాలను దొంగిలించినట్లు విచారణలో స్పష్టమైంది. ఘటన తర్వాత నిర్వహించిన విస్తృత తనిఖీల్లో చోరీకి గురైన ఆయుధాలు, మ్యాగజైన్లు, బుల్లెట్లు, బైనాక్యులర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆర్మ్స్ డిపోలోకి ప్రవేశం ఉన్న 16 మందిపై దృష్టి సారించిన దర్యాప్తు బృందం, హవల్దార్ టీపీఎస్ రావు, మల్లేష్ అలియాస్ రాజులను తీవ్రంగా ప్రశ్నించింది.

విచారణ సమయంలో మల్లేష్ అధికారులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినప్పటికీ, సాంకేతిక ఆధారాలు చూపించడంతో అతడిలో భయం కనిపించింది. దీంతో అధికారులు మల్లేష్ భార్యకు కేసుకు సంబంధించిన సమగ్ర విషయాలను వివరించగా, ఆమె నిలదీయడంతో మల్లేష్ నిజాన్ని ఒప్పుకున్నాడు. ఆమె ఇచ్చిన సమాచారంతో దొంగిలించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఆయుధాలను మొదట ఒక చోట పాతిపెట్టి, ఆ తర్వాత మరో ప్రాంతానికి ఎందుకు మార్చాడనే కోణంలో లోతైన దర్యాప్తు కొనసాగుతోంది. దేశ భద్రతకు ముప్పుగా మారే ప్రమాదమున్న ఈ కేసును వేగంగా ఛేదించిన మిలిటరీ అధికారులను, పోలీసు బృందాన్ని డీజీపీ సీవీ ఆనంద్ అభినందించారు.