Voter Registration: దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా నమోదు ప్రక్రియను మరింత పటిష్ఠం చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) సన్నాహాలు ప్రారంభించింది. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ పూర్తయిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కొత్త ఓటర్ల నమోదు కోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని కీలక ఆదేశాలు జారీ చేసింది. ఓటర్ల జాబితాలో ఇప్పటివరకు చోటు దక్కని వారిని, తొలిసారి ఓటు హక్కు పొందే అర్హత కలిగిన యువతను గుర్తించి వారి పేర్లను నమోదు చేయడంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించింది.
ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన ఎన్నికల అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం లేఖలు పంపింది. ఎన్నికల అధికారులతో నిర్వహించిన సమగ్ర సమీక్షా సమావేశం అనంతరం ఈ ఆదేశాలు వెలువడ్డాయి. అర్హత కలిగిన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించడమే ఈ ప్రత్యేక డ్రైవ్ ప్రధాన ఉద్దేశమని ఈసీ స్పష్టం చేసింది. ఈ ప్రక్రియలో భాగంగా బూత్ లెవెల్ అధికారులు (బీఎల్‌ఓలు) ప్రస్తుతం ఉన్న ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలించి, పాత జాబితాతో పోల్చి చూస్తారు. అనంతరం ఓటరు కార్డు లేని కొత్త వారి వివరాలను సేకరిస్తారు.
నెలాఖరు నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. అందుకోసం ప్రతి వారం కనీసం 20 నుంచి 25 మంది ఓటర్ల ఇళ్లకు వెళ్లి నేరుగా వివరాలు సేకరించాలని సూచించారు. పగటిపూట పనులకు వెళ్లే కార్మికులు, ఉద్యోగులు, యువత సౌకర్యార్థం ప్రత్యేకంగా బూత్ లెవెల్ క్యాంపులను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రత్యేక డ్రైవ్‌పై విద్యాసంస్థలు, స్థానిక స్వయంసహాయక సంఘాలు, మీడియా ద్వారా విస్తృత అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారులను ఈసీ ఆదేశించింది.
