ఆటో ఎక్కాలంటే జేబు గుల్ల కావాల్సిందే.. రవాణా శాఖ సంచలన నిర్ణయం!

Auto Fares

Auto Fares

Auto Fares: తెలంగాణ రాష్ట్రంలో ఆటో ప్రయాణికులకు ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. పెరిగిన ఇంధన ధరలు, ఆటోల నిర్వహణ ఖర్చులను దృష్టిలో ఉంచుకుని ఆటో ఛార్జీలను భారీగా పెంచుతూ రవాణా శాఖ జీవో నంబర్ 46ను జారీ చేసింది. ఈ ఉత్తర్వులను తక్షణమే అమల్లోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించింది.

నూతన నిబంధనల ప్రకారం ఆటో ప్రయాణానికి కనీస ఛార్జీ (మినిమమ్ ఫేర్) రూ.30గా నిర్ణయించారు. మొదటి 1.6 కిలోమీటర్ల ప్రయాణానికి ఈ కనీస రుసుము వర్తిస్తుంది. ఆ తర్వాత సాగే ప్రతి కిలోమీటర్‌కు అదనంగా రూ.14 వసూలు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక రాత్రి వేళల్లో ప్రయాణించే వారికి అదనపు ఛార్జీల భారం పడనుంది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల మధ్య ప్రయాణించే వారు సాధారణ ఛార్జీ కంటే 1.5 రెట్లు (అదనంగా 50 శాతం) చెల్లించాల్సి ఉంటుంది. ట్రాఫిక్ నిలిచిపోయినా లేదా ఇతర కారణాల వల్ల ఆటో ఆగిపోతే వెయిటింగ్ ఛార్జీల కింద నిమిషానికి 75 పైసలుగా ఖరారు చేశారు.

అంతేకాకుండా ఆటోలో తీసుకెళ్లే లగేజీపై కూడా ప్రభుత్వం సరికొత్త నిబంధనలను విధించింది. తక్కువ లగేజీకి ఎలాంటి రుసుము ఉండదు కానీ, పరిమితికి మించి లగేజీ ఉంటే ప్రతి ప్యాకేజీకి రూ.0.50 పైసల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. గరిష్టంగా 100 కేజీల వరకు లగేజీని ఆటోలో తీసుకెళ్లేందుకు అనుమతించారు.

పెరిగిన ఛార్జీలతో ప్రయాణికులపై కాస్త భారం పడుతున్నప్పటికీ, ఆటో డ్రైవర్ల సంక్షేమాన్ని, వారి జీవనోపాధిని పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వివరించింది. సవరించిన ఛార్జీలకు అనుగుణంగా ఆటో మీటర్లను సీల్ చేసి రీ-కాలిక్యులేషన్ చేసుకునేందుకు డ్రైవర్లకు మూడు నెలల సమయం ఇచ్చారు. ఒక్కసారిగా కనీస ఛార్జీ రూ.30కి పెరగడంతో ఆటో ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.