Bhatti Jagan: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ చీఫ్ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తిరిగి కాంగ్రెస్ పక్షానికి రాబోతున్నారనే ప్రచారం ఊపందుకుంటున్న వేళ, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. గతంలో కాంగ్రెస్ పార్టీని వీడి సొంత పార్టీలు పెట్టుకున్న, లేదా ఇతర పార్టీల్లో చేరిన పాత నాయకులందరూ తిరిగి మాతృసంస్థలోకి రావాలని ఆయన బహిరంగంగా పిలుపునిచ్చారు.
కేరళలోని కొచ్చిలో నిర్వహించిన ‘ఇండియా టుడే కాంక్లేవ్ సౌత్ 2026’ కార్యక్రమంలో పాల్గొన్న భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డితో తాను కలిసి పనిచేశానని గుర్తుచేసుకున్నారు. ఆయన కుమారుడు వైఎస్ జగన్‌తో నేరుగా పనిచేయకపోయినా, గతంలో పార్టీని వీడి వెళ్లిన నేతలందరూ తిరిగి కాంగ్రెస్ గూటికి వస్తే అత్యంత సంతోషించే వ్యక్తుల్లో తానే మొదటి వరుసలో ఉంటానని తెలిపారు. ఒక్క వైఎస్ జగన్ మాత్రమే కాకుండా మమతా బెనర్జీ, శరత్ పవార్ వంటి సీనియర్ నేతలంతా కాంగ్రెస్ సిద్ధాంతాల అమలుకు, దేశ బలోపేతానికి మళ్లీ ఒకే వేదికపైకి రావాలని ఆకాంక్షించారు.
మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారెంటీ పథకాలపై స్పందిస్తూ, ఇవి కేవలం ఉచితాలు కాదని, పేదలకు ఆత్మగౌరవాన్ని ఇవ్వడంతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసే చర్యలని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ ఆరోగ్యశ్రీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతు భరోసా వంటి పథకాలు పేద ప్రజల కొనుగోలు శక్తిని పెంచుతాయని వివరించారు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాల పట్ల తీవ్ర వివక్ష చూపిస్తోందని విమర్శించారు. తెలంగాణ నుంచి కేంద్రానికి రూపాయి పన్ను రూపంలో చెల్లిస్తే, తిరిగి రాష్ట్రానికి వచ్చేది కేవలం 43 పైసలు మాత్రమేనని, ఈ అసమానతలపై కేంద్రం పునరాలోచించాలని డిమాండ్ చేశారు.
