CM Revanth Reddy: ప్రభుత్వానికి మంచి పేరొచ్చినా లేదా చెడ్డ పేరొచ్చినా అది పూర్తిగా ప్రభుత్వ ఉద్యోగుల పనితీరు పైనే ఆధారపడి ఉంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కరీంనగర్లో నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ భవనాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొనగా, కలెక్టరేట్ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. నూతనంగా అందుబాటులోకి వచ్చిన కలెక్టరేట్ భవనాలు కేవలం పరిపాలనా కేంద్రాలుగానే కాకుండా, పేద ప్రజల సమస్యల పరిష్కార వేదికలుగా ఉపయోగపడాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఫలాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరవేయడంలో ప్రభుత్వ ఉద్యోగులే ప్రధాన భూమిక పోషిస్తారని పేర్కొన్నారు. రాష్ట్రంలో దాదాపు 10.5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే, వారు సుమారు నాలుగు కోట్ల మంది ప్రజలకు సేవలు అందిస్తున్నారని తెలిపారు. కేవలం 3 శాతం మంది ఉద్యోగులు 97 శాతం ఉన్న ప్రజానీకానికి సేవ చేయడం ఎంతో శ్రమతో కూడుకున్న పని అయినప్పటికీ, ప్రజల పట్ల బాధ్యతగా మెలగాలని ఉద్యోగులకు సూచించారు.
రాష్ట్రాభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని సీఎం వ్యాఖ్యానించారు. కేవలం ఎన్నికల సమయం వచ్చినప్పుడే రాజకీయాలు, ప్రత్యర్థులు అనే భావన ఉండాలని, మిగతా సమయాల్లో రాష్ట్రం, కేంద్రం పరస్పరం సహకరించుకునే ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొనాలని ఆకాంక్షించారు. కేంద్ర ప్రభుత్వంతో సహకరిస్తూ అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద కేంద్రం నుంచి ఇప్పటికే రూ.810 కోట్లు సాధించుకున్నామని వెల్లడించారు. అభివృద్ధి పనుల్లో వేగం పెంచి ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
