Save Democracy: కేంద్ర ఎన్నికల సంఘం తీరుకు నిరసనగా, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో జరుగుతున్న అక్రమాలను నిలదీస్తూ విపక్ష ‘ఇండియా’ కూటమి దేశవ్యాప్త ఉద్యమానికి పిలుపునిచ్చింది. ఢిల్లీ వేదికగా సమావేశమైన కూటమి అగ్రనేతలు భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేశారు. ఇందులో భాగంగా అక్టోబర్ 2న గాంధీ జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ‘సేవ్ డెమొక్రసీ మార్చ్’ ప్రారంభించనున్నట్లు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వెల్లడించారు.
అక్టోబర్ 2 నుంచి 8 వరకు వారం రోజుల పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రదర్శనలు, కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అక్టోబర్ 6న ‘ఇండియా’ కూటమికి చెందిన పార్లమెంట్ సభ్యులంతా కలిసి ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం వద్ద నిరసన తెలుపనున్నారు. ప్రజాస్వామ్య రక్షణే ధ్యేయంగా నిర్వహించే ఈ ఉద్యమంలో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు దేశంలోని ప్రధాన నగరాల్లో ఐదు భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నారు.
అలాగే అక్టోబర్ రెండో వారంలో విపక్ష నేతల బృందం రాష్ట్రపతిని కలిసి ఈ వినతిపత్రం అందజేయనుంది. నవంబర్ 1న జాతీయ రాజధాని ఢిల్లీలో ‘ఇండియా’ కూటమి ఆధ్వర్యంలో అత్యంత భారీ బహిరంగ సభ నిర్వహించి తమ నిరసన గళాన్ని బలంగా వినిపించనున్నట్లు కాంగ్రెస్ నాయకత్వం స్పష్టం చేసింది.
