నిమ్స్‌‌లో అవినీతి కలకలం.. ఏసీబీ కేసులో అదనపు సూపరింటెండెంట్ లక్ష్మీ భాస్కర్ సస్పెన్షన్!

Lakshmi Bhaskar

Lakshmi Bhaskar

Lakshmi Bhaskar: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కేసులో అరెస్టయి కస్టడీలో ఉన్న నిజామ్స్ ఇన్సిస్ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) అదనపు మెడికల్ సూపరింటెండెంట్, అదనపు ప్రొఫెసర్ డాక్టర్ నోరి లక్ష్మీ భాస్కర్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాహుల్ దేవరాజ్ ఈనెల 28న అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సస్పెన్షన్ సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు.

ఏసీబీ అధికారులు అందించిన అధికారిక నివేదిక ప్రకారం, డాక్టర్ లక్ష్మీ భాస్కర్‌ను సెప్టెంబర్ 22 సాయంత్రం 6.30 గంటలకు అధికారులు అరెస్టు చేసి కస్టడీకి తరలించారు. ఏసీబీ కస్టడీ 48 గంటలు దాటడంతో తెలంగాణ స్టేట్ సివిల్ సర్వీసెస్ నిబంధనలు – 1991 ప్రకారం సస్పెన్షన్ అర్హత ఏర్పడినట్లు నిమ్స్ అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వం జారీ చేసిన మెమో, ఏసీబీ రేడియో మెసేజ్‌‌లను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు డైరెక్టర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

వైద్యారోగ్య శాఖలో బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ అవినీతికి పాల్పడటం తీవ్ర పరిణామాలకు దారితీసింది. ఆసుపత్రి యాజమాన్యం మరియు ప్రభుత్వ ఆదేశాల మేరకు విచారణ పూర్తయ్యే వరకు లక్ష్మీ భాస్కర్ సస్పెన్షన్‌లోనే ఉంటారని అధికారులు వెల్లడించారు. రోగులకు మెరుగైన సేవలు అందించాల్సిన నిమ్స్ ఆసుపత్రిలో ఇటువంటి ఘటనలు జరగడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.