Bathukamma Celebrations: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబరాలు హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలకు రాష్ట్రవ్యాప్తంగా వందలాది మంది మహిళలు విశేషంగా తరలివచ్చారు. రంగురంగుల తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ పాటలు పాడుతూ ఉత్సాహంగా ఆడిపాడారు. మహిళల కోలాటాలు, బతుకమ్మ పాటలతో రవీంద్రభారతి ప్రాంగణం మార్మోగింది.
ఈ ప్రారంభ వేడుకలకు రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథులుగా హాజరై మహిళలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతి ప్రసాదించిన పూలను దేవతగా కొలిచే అపూర్వమైన పండుగ బతుకమ్మ అని వారు పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల సామూహిక జీవన విధానానికి, కష్టసుఖాలను కలిసి పంచుకునే ఐక్యతా భావానికి ఈ ఉత్సవం నిజమైన నిదర్శనమని చెప్పారు.
రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాలని, ప్రతి ఒక్కరూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని మంత్రులు ఆకాంక్షించారు. తెలంగాణ సుభిక్షంగా వర్ధిల్లాలని, మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి ఆర్థికంగా మరింత బలోపేతం కావాలని వారు అభిలాషించారు. ఈ వేడుకల్లో పర్యాటక శాఖ స్పెషల్ సీఎస్ వాణిప్రసాద్, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ నర్సింహారెడ్డి, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్‌పర్సన్ వెన్నెల గద్దర్‌తో పాటు పలువురు కార్పొరేషన్ చైర్‌పర్సన్లు, ముఖ్య నేతలు, అధికారులు పాల్గొన్నారు.
