Fly Dubai: సెప్టెంబర్ 30న ఫ్లై దుబాయ్ ప్రయాణీకుల విమానంలో చోటుచేసుకున్న భయాందోళనకరమైన ఉదంతంపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కేసు నమోదు చేసింది. కాక్‌పిట్‌లోనే ఒమన్‌కు చెందిన కో-పైలట్ (ఫస్ట్ ఆఫీసర్), భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్చార్‌పై కత్తితో దాడి చేసి, విమానాన్ని హైజాక్ చేయడానికి లేదా కూల్చివేసేందుకు యత్నించాడనే తీవ్ర ఆరోపణలపై ఎఫ్ఐఆర్ దాఖలైంది.
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్రోహ నిరోధక చట్టం, యాంటీ-హైజాకింగ్ యాక్ట్-2016లోని తీవ్రమైన సెక్షన్ల కింద ఎన్ఐఏ విచారణ చేపట్టింది. గతనెల 30న దుబాయ్ నుంచి బయలుదేరిన ఫ్లైదుబాయ్ FZ1073 విమానంలో 174 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. విమానం గాల్లో ఉండగా ఒమన్‌కు చెందిన ఫస్ట్ ఆఫీసర్ భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్చార్‌పై తీవ్ర స్థాయిలో కత్తితో దాడికి పాల్పడ్డాడు.
ఈ ఘోర దాడిలో కెప్టెన్ స్మిత్ మచ్చార్ తల, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన ప్రయాణికులు, ఇతర సిబ్బంది నిందితుడిని అడ్డుకోగా, ఇతర పైలట్లు విమానాన్ని సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ బిన్ అబ్దుల్ అజీజ్ విమానాశ్రయంలో అత్యవసరంగా దించారు. విమాన ప్రమాదాన్ని నివారించి వందలాది మంది ప్రాణాలను కాపాడిన ఈ ఘటన వెనుక ఉన్న అంతర్జాతీయ కుట్ర కోణాలపై ఎన్ఐఏ లోతుగా దర్యాప్తు జరుపుతోంది.
