Boat Accident: బీహార్ రాష్ట్రంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వైశాలి జిల్లాలోని రాఘవ్పూర్ ప్రాంతంలో ప్రయాణికులతో వెళ్తున్న ఒక పడవ ప్రమాదవశాత్తు గంగా నదిలో మునిగిపోయింది. ఈ ఘోర దుర్ఘటనలో కనీసం 10 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
వైశాలి జిల్లా పరిధిలోని రాఘవ్పూర్ వద్ద ప్రయాణికులు గంగా నదిని దాటుతున్న సమయంలో ఈ విషాదం సంభవించింది. పడవ సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం (ఓవర్ లోడింగ్) వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. పడవ నది మధ్యలోకి చేరుకున్న తర్వాత ఒక్కసారిగా నీటిలో మునిగిపోయింది. నీటి ప్రవాహంలో చిక్కుకుని 10 మంది ప్రాణాలు కోల్పోగా, మరికొందరు గల్లంతైనట్లు తెలుస్తోంది.
ముమ్మరంగా సహాయక చర్యలు:
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే స్థానిక యంత్రాంగం, ఎస్డిఆర్ఎఫ్ (SDRF) రెస్క్యూ బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. నదిలో గల్లంతైన వారి కోసం నిపుణులైన గజఈతగాళ్ల సహాయంతో తీవ్రంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. స్థానికులు, పోలీసులు కలసి సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నారు. ఈ ఘోర పడవ ప్రమాదంతో ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు, శోకసంద్రం అలుముకున్నాయి.
