Andhra Pradesh: దక్షిణాది పారిశ్రామిక రంగంలో ఇప్పుడు సరికొత్త ‘డేటా’ రాజకీయం నడుస్తోంది. ఆటలో వెనుకబడినప్పుడు ప్రత్యర్థిపై ‘ఫౌల్’ ఆరోపణలు చేయడం పాత చిట్కాయే! సరిగ్గా ఇదే సూత్రాన్ని తమిళనాడు పాలకులు అనుసరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సాధించిన అనూహ్య పారిశ్రామిక ప్రగతిని చూసి జీర్ణించుకోలేక, తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు చెన్నై కేంద్రంగా ‘గూఢచర్యం’ అనే కొత్త కథనాన్ని అల్లారు.
అంకెలే అసలు సాక్ష్యాలు – ఎందుకు ఇంత కంగారు?
జాతీయ స్థాయి గణాంకాలను పరిశీలిస్తే తమిళనాడు ఆందోళన వెనుక అసలు కారణం స్పష్టమవుతుంది. 2024లో దేశంలోని కొత్త ప్రాజెక్టుల్లో కేవలం 3.01 శాతానికి పరిమితమైన ఆంధ్రప్రదేశ్ వాటా, 2026 నాటికి ఏకంగా 15.36 శాతానికి ఎగబాకింది. తొమ్మిదో స్థానం నుంచి ఏపీ నేరుగా రెండో స్థానానికి దూసుకెళ్లగా, కర్ణాటక వాటా 8.25 నుంచి 5.67 శాతానికి పడిపోయి నాలుగో స్థానం నుంచి ఆరో స్థానానికి జారింది. రూ. 32.49 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలతో పాటు, వాటిని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడంలో ఏపీ 74 శాతం కన్వర్షన్ రేటు సాధించడం పొరుగు రాష్ట్రాల పాలకులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.
అంతర్గత సంక్షోభాన్ని కప్పిపుచ్చే ‘స్పై’ నాటకం
1.దక్షిణ కొరియాకు చెందిన మూడు సంస్థల రూ. 1,614 కోట్ల పెట్టుబడులు ఏపీకి రావడాన్ని జీర్ణించుకోలేని తమిళనాడు వర్గాలు, ‘గైడెన్స్ తమిళనాడు’ ఉద్యోగులు రహస్యాలు లీక్ చేశారని ప్రచారం మొదలుపెట్టాయి. కానీ ఇందులో నిజం లేదని అక్కడి పరిణామాలే చెబుతున్నాయి:
2. జులైలోనే ఆ సంస్థ తమ వద్ద సామూహిక రాజీనామాలు జరగలేదని, మెరుగైన అవకాశాల కోసమే ఉద్యోగులు వెళ్లారని ప్రకటించింది.
3. నిజంగానే వారు రహస్యాలు లీక్ చేసి ఉంటే, నెల రోజుల నోటీస్ పీరియడ్ పాటు వారిని కీలక స్థానాల్లో ఎందుకు కొనసాగించారు?
కొత్త యాజమాన్య వేధింపుల వల్లే వెళ్లిపోతున్నామని ఆ ఉద్యోగులు ఆగస్టులోనే సీఎంఓకు లేఖ రాసినట్లు వార్తలు రావడం ఈ ‘గూఢచర్యం’ కథనాన్ని పూర్తిగా తేలిపోయేలా చేసింది. నాన్-కంపీట్ నిబంధన లేని వారు ఏపీ సంస్థలో చేరడాన్ని తప్పుబట్టడంపై అక్కడి ప్రతిపక్ష నేతలే ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు.
చిట్టీలతో కాదు.. చిత్తశుద్ధితోనే విజయం
వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టే అంతర్జాతీయ సంస్థలు ఎవరో ఇచ్చే రహస్య చిట్టీలను చూసి నిర్ణయాలు తీసుకోవు. స్థిరమైన విధానాలు, నాణ్యమైన విద్యుత్, పుష్కలమైన నీరు, భూమితో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు అనుభవం, మంత్రి లోకేశ్ చొరవతో అమలవుతున్న ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ చూసి ఏపీ వైపు క్యూ కడుతున్నాయి. ఆధారాలు లేని ఆరోపణలతో కాలక్షేపం చేయడం మాని, పెట్టుబడిదారులను ఆకర్షించే విధానాలపై తమిళనాడు దృష్టి పెట్టడం ఉత్తమం