ఐటీ కారిడార్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల షాకింగ్ తనిఖీలు.. ప్రముఖ కేఫ్‌లు, రెస్టారెంట్ల మూసివేత

Food Safety

Food Safety

Food Safety: నగరవాసుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న హోటళ్లు, రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. ఐటీ కారిడార్‌గా గుర్తింపు పొందిన మాదాపూర్, గచ్చిబౌలి పరిసర ప్రాంతాల్లో నిబంధనలు ఉల్లంఘించిన 11 ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్ల లైసెన్సులను ఫుడ్ సేఫ్టీ అధికారులు తక్షణమే రద్దు చేశారు. ఇటీవల కాలంలో ఫుడ్ సేఫ్టీ టాస్క్‌ఫోర్స్ బృందాలు నగరంలోని పలు ఆహార కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయి.

ఈ క్రమంలోనే కిచెన్ల పరిశుభ్రత, వంటకాల్లో ఉపయోగిస్తున్న నాణ్యతను పరిశీలించగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. వంటశాలల్లో కుళ్లిన కూరగాయలు, గడువు ముగిసిన మసాలా దినుసులు, నిల్వ ఉంచిన నాన్-వెజ్ పదార్థాలను ఉపయోగిస్తున్నట్లు అధికారులు ప్రత్యక్షంగా గుర్తించారు. కొన్నిచోట్ల ఈగలు, బొద్దింకలతో అపరిశుభ్ర వాతావరణంలో వంటలు చేస్తున్నట్లు తేలింది.

నిబంధనలు ధిక్కరించిన సంస్థలపై కఠిన చర్యల్లో భాగంగా లక్కీ రెస్టారెంట్, మొనాస్ట్రీ, కోల్ స్పార్క్, కాంచి కేఫ్, అల్ సబా, శివాని బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్సులను అధికారులు రద్దు చేశారు. వీటితో పాటు ఉడిపీస్ ఉపహార్, అంతెరా కిచెన్ అండ్ బార్, సాయిరాం మెస్, అమ్ ఆహా తెలుగు కిచెన్, ఫ్యూజన్ 9, అమ్నీషియా స్కైబార్ వంటి ప్రముఖ సంస్థల అనుమతులను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఐటీ ఉద్యోగులు, యువత పెద్ద సంఖ్యలో వచ్చే ఈ రెస్టారెంట్లలో నిల్వ ఆహారాన్ని విక్రయించడంపై అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

నాణ్యతా ప్రమాణాలు పాటించని సంస్థలపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నగరవ్యాప్తంగా తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడితే ఎంతటి పెద్ద రెస్టారెంట్‌ అయినా ఉపేక్షించేది లేదని ఫుడ్ సేఫ్టీ టాస్క్‌ఫోర్స్ స్పష్టం చేసింది.