Dr Saidulu: అక్షరాన్ని నమ్ముకుని, విజ్ఞానాన్ని ఆయుధంగా మలుచుకుని వేలాది మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపిన ఉపాధ్యాయుడు డాక్టర్ అక్కెనపల్లి సైదులు. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఆయన, జీవితంలో ఎదురైన ఎన్నో ఆటుపోట్లను అధిగమించి విద్యనే తన ఊపిరిగా మార్చుకున్నారు. దాదాపు పాతిక సంవత్సరాల సుదీర్ఘ ఉపాధ్యాయ ప్రస్థానంలో ఎన్నో మరపురాని జ్ఞాపకాలను, విజయాలను సొంతం చేసుకున్న ఆయన, రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలం తరఫున ‘తెలంగాణ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు’ను అందుకోవడమే కాకుండా ఇదే ఏడాది గణితశాస్త్రంలో డాక్టరేట్ పట్టా కూడా పొంది అరుదైన ఘనత సాధించారు. బడ్జెట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోషియేషన్ ఈ ఏడాది ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డును తనకు అందించడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అసోషియేషన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
తాను పడ్డ కష్టాలు, అనుభవించిన అడ్డంకులు ఏ నిరుపేద విద్యార్థి పడకూడదనే సంకల్పంతో డాక్టర్ సైదులు తన జీవితాన్ని బోధనకే అంకితం చేశారు. కేవలం బోధనకే పరిమితం కాకుండా నిరంతరం జ్ఞానాన్వేషణ చేస్తూ ఎం.ఎస్సీ (మ్యాథ్స్), ఎం.ఎస్సీ (ఫిజిక్స్), ఎంబీఏ, ఎం.ఈడి, ఎం.పి.ఈడి, ఎం.ఏ (సోషియాలజీ), ఎం.ఏ (సైకాలజీ), ఎం.ఏ (ఫిలాసఫీ), ఎంఎల్ఐఎస్, సీసీ యోగా, ఎంసీజే వంటి అనేక ఉన్నత డిగ్రీలను సాధించి విద్యాభ్యాసంలో సరికొత్త మైలురాయిని నెలకొల్పారు.
అజ్ఞానమనే చీకట్లను పారద్రోలి, నిరుపేద విద్యార్థుల జీవితాల్లో అక్షర జ్యోతులు వెలిగించడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. తన తల్లిదండ్రులు, గురువుల మార్గదర్శనమే తనను ఇంతటి వాడిని చేసిందని ఆయన చెబుతున్నారు. జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ఎన్నో సత్కారాలు, అవార్డులు పొందిన డాక్టర్ అక్కెనపల్లి సైదులు, నేటి తరానికి, తోటి ఉపాధ్యాయులకు గొప్ప స్ఫూర్తిగా నిలిచారు. ఉపాధ్యాయ వృత్తికి సరికొత్త అర్థం చెబుతూ ఆయన అందిస్తున్న సేవలు అందరి ప్రశంసలు అందుకుంటున్నాయి.
