TELANGANA: మంత్రి కొండా సురేఖ వ్యవహారంలో అధిష్ఠానం చర్యలపై తీవ్ర ఉత్కంఠ !

ప్రజాభవన్‌కు పరుగులు!

డిప్యూటీ సీఎంతో విడివిడిగా కొండా మురళి, రాజగోపాల్‌రెడ్డి భేటీ

మంత్రి కొండా సురేఖ వ్యవహారంలో అధిష్ఠానం చర్యలపై తీవ్ర ఉత్కంఠ

వేటు నుంచి తప్పించుకునేందుకే ముందస్తు భేటీ అంటూ ప్రచారం

మేము కాంగ్రెస్‌లోనే ఉంటామని స్పష్టం చేసిన కొండా మురళి

మినిట్ 2 మినిట్, హైదరాబాద్ (ఆగస్ట్ 27):  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మంత్రి కొండా సురేఖ వ్యవహారం రోజురోజుకు తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఆమెపై అధిష్ఠానం ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోబోతోందనే సస్పెన్స్ కొనసాగుతున్న వేళ, రాష్ట్ర రాజధానిలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో ప్రజాభవన్‌లో మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళితో పాటు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విడివిడిగా సమావేశమయ్యారు. బుధవారం ప్రజాభవన్‌లో భట్టిని కలిసి పార్టీలో ఇటీవల జరిగిన పరిణామాలపై చర్చించినట్లు సమాచారం. ఈ భేటీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది.

అయితే, మంత్రి కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీ నియమావళిని ఉల్లంఘించడం ఇది మూడోసారని, చిన్నారెడ్డి సైతం లైన్ దాటి మాట్లాడారని, వీరిని ఉపేక్షిస్తే పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని కాంగ్రెస్ క్రమశిక్షణా వ్యవహారాల కమిటీ టీపీసీసీ చీఫ్‌కు నివేదిక సమర్పించింది. ఈ నేపథ్యంలో కొండా సురేఖపై వేటు తప్పదనే చర్చ జరుగుతున్న వేళ, ఆమె భర్త కొండా మురళి డిప్యూటీ సీఎంతో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి రేకెత్తిస్తోంది. ఒకవేళ సురేఖ, చిన్నారెడ్డిలపై చర్యలు తీసుకోవాల్సి వస్తే, ఆ వెంటనే రాజగోపాల్‌రెడ్డిపైనా చర్యలు తీసుకోవాలనే డిమాండ్ కూడా తెరపైకి వస్తోంది. ఈ నేపథ్యంలో వేటు నుంచి తప్పించుకునేందుకే రాజగోపాల్‌రెడ్డి ముందస్తుగా భట్టిని కలిశారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు భట్టి విక్రమార్కతో భేటీ అనంతరం కొండా మురళి మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఆమె మనోభావాలు ఆమెకు ఉంటాయని, ఆమెను ప్రశ్నించే హక్కు తమకు లేదన్నారు. తమకు గాంధీ కుటుంబంపై సంపూర్ణ విశ్వాసం ఉందని, తాము కాంగ్రెస్‌లోనే కొనసాగుతామని తేల్చిచెప్పారు. కమిటీ నిర్ణయం వెలువడే వరకు దీని గురించి ఏమీ మాట్లాడబోనని, ఒక బిల్లు విషయమై భట్టిని కలిసినట్లు వివరించారు.