Captain Smith: ఫ్లైదుబాయ్ విమానంలో ఉగ్రవాద కుట్రను సమర్థవంతంగా తిప్పికొట్టి, వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్ఛర్ సాహసాన్ని అమెరికా ప్రతినిధుల సభ (US House of Representatives) అధికారిక తీర్మానం ద్వారా కొనియాడింది. అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించి ప్రపంచవ్యాప్తంగా భారతదేశ కీర్తిని పెంచిన ఆయన సమయస్ఫూర్తిని యుఎస్ హౌస్ ప్రశంసించింది.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు 174 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఫ్లైదుబాయ్ ఫ్లైట్ 1073 విమానంలో ఫస్ట్ ఆఫీసర్ (సహ పైలట్) గొడ్డలితో కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌పై దాడి చేసి విమానాన్ని తన ఆధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో విమానం కేవలం 30 సెకన్ల వ్యవధిలోనే 14,000 అడుగులకు పైగా కిందకు పడిపోయింది. తీవ్ర గాయాలైనప్పటికీ ధైర్యం సడలని కెప్టెన్ స్మిత్, తన చివరి శక్తుల వరకు పోరాడి కాక్‌పిట్ తలుపులను అన్‌లాక్ చేశారు. దీనితో విధుల్లో లేని ఇతర పైలట్లు, సిబ్బంది కాక్‌పిట్‌లోకి ప్రవేశించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం విమానాన్ని సౌదీ అరేబియాలోని తబుక్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేయడంతో ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనను ఉగ్రవాద దాడిగా యుఎఇ రక్షణ సంస్థలు ప్రకటించాయి. క్లిష్ట సమయంలో ప్రాణాలకు తెగించి విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేసిన కెప్టెన్ స్మిత్ మచ్ఛర్ వీరత్వానికి అమెరికా పార్లమెంట్ జేజేలు పలికింది.
